Gona Ganna Reddy Interview

గోన గన్నారెడ్డి..!
4-Allu-Arjun-as-Gona-Ganna-Reddy-in-Rudhramadevi-First-Look-Posters-HD-Photos
గమ్మునుండవో..నీ మొల్తాడులో నా తాయత్తు… నాకు అన్యాయం చేస్తే ఏడువ.. నా ముందు అన్యాయం జరిగితే ఇడువ ఉంటే వైకుంఠం.. లేకుంటే ఊకుంటం.. పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేనేమైనా అభిమన్యుణ్ణి అనుకున్నార్రా.. వ్యూహాలు రచించే కృష్ణ పరమాత్ముడి మొగుణ్ణి అంటూ గోన గన్నారెడ్డిగా రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ మన యాసలో పలికిన సంభాషణలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ పాత్ర కోసం తెలంగాణ యాస నేర్చుకొని.. తన అభినయంతో అందరి చేత సాహో గోన గన్నారెడ్డి అనిపించుకున్న అల్లు అర్జున్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఇక గోన గన్నారెడ్డి పాత్ర గురించి.. తన వ్యక్తిగత విషయాల గురించి అల్లు అర్జున్ చెప్పిన కబుర్లు ఈ ఆదివారం ప్రత్యేకంగా మీకోసం..

సాహో గోన గన్నారెడ్డి..! ఎలా వుంది మీ ప్రజల స్పందన?
నా పాత్రకు, సినిమాకు కచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుసు. కానీ ఇంతటి అద్భుత ఆదరణ ఊహించలేదు. థ్యాంక్యూ.. వెరీ మచ్ టు ఆడియన్స్!

గోన గన్నారెడ్డి కోసం తెలంగాణ యాసను నేర్చుకున్నారా?
గోన గన్నారెడ్డి పాత్రలో స్వచ్ఛమైన తెలంగాణ యాస ఉంది. ఈ పాత్రకు తెలంగాణ యాసను ఉపయోగించే విషయంలో మొదట నేనే చొరవ తీసుకున్నాను. నా నిర్ణయాన్ని గుణశేఖర్ అంగీకరించడమే కాకుండా దాని కోసం చాలా పరిశోధన చేశారు. ఆ తర్వాతే గోన గన్నారెడ్డి పాత్ర రూపకల్పనపై ఒక అవగాహనకు వచ్చారు. ఒక రెగ్యులర్ డైలాగ్‌ను తెలంగాణ యాసలో చెప్పడం వల్ల దానికి మరింత అందం చేకూరింది. తెలంగాణతో పాటు తెలుగు వారంతా గర్వపడే సినిమా ఇది. కేంద్రగా చేసుకొని రుద్రమదేవి పాలన కొనసాగించింది. మన సంస్కృతికి సంబంధించిన ఇలాంటి సినిమాను ప్రజలు మరింత ఆదరించాలి.

గోన గన్నారెడ్డి పాత్ర చేయడంలో మీ శ్రీమతి తెలంగాణ ఆడబిడ్డ స్నేహారెడ్డి ప్రభావం ఎంత వరకు ఉంటుంది?
మన జీవితాలపై కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండే ప్రతి ఒక్కరి ప్రభావం ఉంటుంది. గోన గన్నారెడ్డి క్యారెక్టర్ కోసం తెలంగాణ భాషను ఉపయోగించాలనే నిర్ణయంలో నా భార్య పాత్ర ఉంది. తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాడే యాసకు, గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే తెలంగాణ యాసకు చాలా వైరుధ్యముంటుంది. సినిమాల్లో స్వచ్ఛమైన గ్రామీణ తెలంగాణ మాండలికాన్ని ఇప్పటివరకు ఎవరూ ఉపయోగించలేదు. కోట శ్రీనివాసరావు, నర్సింగ్‌యాదవ్, ఫిష్ వెంకట్ సినిమాల్లో హైదరాబాదీ స్లాంగ్‌ను ఎక్కువగా వాడతారు. వారికి భిన్నంగా ఉండే భాషను కావాలనుకున్నాను. అదే ఉపయోగించాం.

గోన గన్నారెడ్డి పాత్ర మీలో తీసుకొచ్చిన మార్పు ఏమిటి?
గోన గన్నారెడ్డి పాత్ర చేయాలన్న నిర్ణయమే చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఈ రోజు అది కమర్షియల్‌గా వర్కవుట్ అయింది, కానీ సినిమాను అంగీకరించిన రోజు సాహసోపేతమైన ఆలోచన అనిపించింది. నాపై నమ్మకంతో నేనుగా తీసుకున్న బలమైన నిర్ణయమది. అన్ని తెలిసే అంగీకరించాను. ఈవిధంగా అంగీకరించిన వాటిలో రుద్రమదేవి మూడవ సినిమా. గతంలో ఆర్య, వేదం సినిమాల్ని ఈ విధంగానే చేశాను. అందరూ వద్దని చెప్పినా ఆ సినిమాల్ని నేను నమ్మి చేశాను. నా నిర్ణయాలు ఎప్పుడు కరెక్ట్‌గానే ఉంటాయి.

గోన గన్నారెడ్డి గురించి ఇంటర్‌నెట్‌లో వెతికితే మీ ఫోటోలు కనిపిస్తున్నాయి. గోన గన్నారెడ్డి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. దీనిని ఎంత వరకు బాధ్యతగా ఫీలవుతున్నారు?
రుద్రమదేవి, గోన గన్నారెడ్డి జీవితాలకు సంబంధించిన సమగ్ర చరిత్ర మనకు అందుబాటులో లేదు. రచనలు, శిలాశాసనాల్లో కొంత మేరకు మాత్రమే లభ్యమవుతుంది. వారి గురించి ఎవరికి పూర్తిగా తెలియదు. తొలిసారిగా అలాంటి గొప్ప వ్యక్తులకు ఓ రూపాన్ని మన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించబోతున్నాం. మనం చెప్పబోయేదే చరిత్ర అని గుణశేఖర్, నేను అనుకున్నాం. కానీ అందులో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని నిశ్చయించుకున్నాం. లాజిక్‌లు మిస్ కాకుండా వాస్తవిక కోణంలోనే వారి వ్యక్తిత్వాన్ని, ఆలోచణ ధోరణిని, రూపాన్ని చూపించాం.

బాహుబలిలో భళ్లాలదేవ పాత్ర చేయాల్సిందింగా రాజమౌళి అడిగితే అంగీకరించేవారా?
చేయను. నాకు ఏది కరెక్ట్, ఏది కాదు అనేది తెలుసు.

సినిమా కాకుండా మీకు ఆటవిడుపు?
చాలా ఉన్నాయి. ఖాళీగా ఉంటేనే నేను చాలా బిజీగా ఉంటాను. సినిమాలు ఉన్నప్పుడే నాకు విరామం దొరుకుతుంది. కుటుంబం, స్నేహితులతో సరాదాగా గడుపుతుంటాను.

తండ్రి అయిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులేమిటి?
తండ్రి కాకముందు నా మాట తీరు చాలా రఫ్‌గా ఉండేది. మాట్లాడేటప్పడు, ఇతరులపై కోపం వచ్చినప్పుడు అనుకోకుండా కొన్నిసార్లు తప్పుడు పదాల్ని వాడేవాణ్ణి. అయాన్ పుట్టిన తర్వాత అలా మాట్లాడటం మానేశాను. ప్రభావం పడకూడదనే నా మాట తీరులో మార్పుచేసుకున్నాను.

అయాన్‌ను ఎలా చూడాలని అనుకుంటున్నారు ?
అయాన్ ఏం చేయాలనే విషయంలో నాకంటూ కొన్ని ఫిలాసఫీలు ఉన్నాయి. అన్ని కాకపోయినా వాటిలో ఒకటో, రెండో అమలు చేయాలని అనుకుంటాను. నా సొంత అభిప్రాయాలన్నింటిని వాడిపై బలవంతంగా రుద్దడం నాకు ఇష్టంలేదు.

అయాన్‌తో స్టార్‌గా మీకున్న అనుబంధం?
వాడు చాలా చిన్న పిల్లాడు కాబట్టి నేను స్టార్‌ను అనే విషయం వాడికి తెలియదు. తెలిసిన తర్వాత వాడి స్పందన ఎలా ఉంటుందో చూడాలని ఉంది. అయితే అందరూ తండ్రుల్లా వాడిని షాపింగ్‌కు, బయటకు తీసుకెళ్లలేకపోతున్నాననే బాధ ఉంది. నా వల్ల వాడు ఇబ్బంది పడటం ఇష్టం ఉండదు.

గంగోత్రి నుంచి రుద్రమదేవి వరకు కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక క్రెడిట్ ఎవరికి ఇస్తారు? హీరోగా అనుకున్న రేంజ్‌కు చేరుకున్నారా?
నాతో పనిచేసిన అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. హీరోగా నేను అనుకున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. తెలుగువారితోపాటు దక్షిణాది వారంతా గర్వపడే హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా కోరిక.

అల్లు అర్జున్ ప్యాషనేట్ హీరో, కొత్తదనం కోసం నిరంతరం తపిస్తుంటాడు అని చాలా మంది చెబుతుంటారు. ఆ పొగడ్త వింటున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది?
అది పొగడ్త కాదని నా అభిప్రాయం. అలాంటి మాటల వల్ల స్ఫూర్తి పొందాను. పొగిడే వారికి నా పట్ల ఉన్న వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అది.

మీ నటన, ఎనర్జీతోనే చాలా సినిమాల్ని విజయాలుగా నిలుపుతుంటారు. మీ వల్లే సినిమాల రేంజ్ పెరిగింది అన్న మాటలతో మీరు ఏకీభవిస్తారా?
రేంజ్‌ల గురించి నాకు తెలియదు. సినిమాల విషయంలో ఒక్కో హీరోకు ఓ శైలి ఉంటుంది. అందరి సినిమాలు నా ైస్టెల్‌లోనే ఉండాలంటే కుదరదు. నేను చేసే ప్రతి పాత్ర, చెప్పే ప్రతి డైలాగ్‌లో నా శైలి ప్రతిబింబించేలా చూసుకుంటాను.

గోన గన్నారెడ్డి పాత్రకు మీతో పాటు ఏ హీరోలకు బాగుంటుందని అనుకుంటున్నారు?
ఈ పాత్రలో చాలా మంది హీరోల్ని ఊహించుకున్నాను. చిరంజీవి, బాలకృష్ణ, చరణ్, తారక్‌లు ఈ పాత్రకు సరిపోయేవారు.

కెరీర్‌లో అందుకున్న బిగ్గెస్ట్ కాంప్లిమెంట్?
ఇద్దరమ్మాయిలతో వేడుకలో దర్శకుడు పూరి జగన్నాథ్ నా కొడుకు బన్నీలా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఆయన ఏ ఇంటెన్షన్‌తో అన్నారో తెలియదు కానీ ఆ మాట చాలా ఆనందాన్నిచ్చింది.

మీరు ఎదుర్కొన్న పెద్ద విమర్శ?
గోన గన్నారెడ్డి పాత్ర చేయాలని నిర్ణయించుకున్న తర్వాత నాన్న నాతో ఈ పాత్ర నువ్వు చేస్తున్నావా? చిరంజీవిని తప్ప ఆ పాత్రలోఎవరిని ఊహించలేకపోతున్నాను అని అన్నారు. నాన్నతో పాటు చాలా మంది ఆ పాత్ర నాకు సరిపోదని అనుకున్నారు. ఆ పాత్రకు న్యాయం చేయలేవు? నీ ఇమేజ్‌కు సూటవ్వదు? అని డైరెక్ట్‌గా విమర్శించారు. కానీ ఆ విమర్శల్ని పట్టించుకోకుండా నా పని పూర్తి చేశాను.

పరిశ్రమలో కథానాయకుల మధ్య పోటీ ఉంటుందా?
వృత్తిపరంగా మా మధ్య పోటీ ఎప్పుడూ ఉంటుంది. పోటాపోటీగా సినిమాలు చేస్తుంటాం. కానీ ఆ కాంపిటీషన్ సినిమాలకే పరిమితం. వ్యక్తిగతంగా మాత్రం మధ్య చక్కటి సంబంధాలున్నాయి. అందుకుంటే ఒకరినొకరం అభినందించుకుంటాం. ఫోన్ చేసి సినిమాల గురించి చర్చించుకుంటాం.

ప్రస్తుతం అగ్రకథానాయకులు చాలా మంది సినిమాలు చేస్తూనే నిర్మాణం, వ్యాపార రంగాలపై దృష్టిసారిస్తున్నారు? మీకు అలాంటి ఆలోచన ఉందా?
నాన్నగారు ఓ బ్యానర్‌ను ప్రారంభించారు. ఒకవేళ నేను సొంతంగా సినిమాలు చేసినా ఆ బ్యానర్ ద్వారానే చేస్తాను. గతంలో 100 పర్సెంట్ లవ్ సినిమా అలాగే చేశాం. నాన్నకు, నాకు నచ్చడంతో ఇద్దరం కలిసి ఆ సినిమా చేశాం. నాకు నచ్చిన కథలను ఆయనకు సూచిస్తుంటాను. నిర్మాతగా నా పేరును వాడాల్సిన అవసరం ఇంకా రాలేదని అనుకుంటున్నాను.

మంచి కథాంశాలతో కూడిన చిన్న సినిమాలు వచ్చినప్పుడు అగ్రకథానాయకులు ప్రోత్సాహం అందించడం లేదనే చాలా మంది అంటుంటారు? నిజమేనా?
గొప్ప సినిమాల్ని మనం తీయడం లేదు. పెద్ద హీరోలు చేసిన సినిమాల్నే పంథాకు భిన్నమైన సినిమాలు చాలా రోజులకు ఒకటి వస్తోంది. గమ్యం సినిమా నాకు నచ్చింది కాబట్టే క్రిష్‌తో వేదం సినిమా చేశాను.

మీ తదుపరి చిత్ర విశేషాలు?
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నాను. యాక్షన్ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యముంటుంది. సరైనోడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాం.

కొత్త కథలు వింటున్నారా?
కథలు వింటున్నాను! కానీ కొత్తగా ఉండటం లేదు(నవ్వుతూ)

మీరు చేసిన వాటిలో టాప్ ఫైవ్ చిత్రాలు?
మంచి సినిమాలు చేశాను కానీ గొప్ప సినిమాలు మాత్రం చేయలేదు. నేను నటించిన చిత్రాల్లో ఆర్య ఎప్పటికీ నంబర్‌వన్. ఆ తర్వాత చేసినవన్నీ రెండో స్థానంలోనే ఉంటాయి.

మీరు చేసిన వాటిలో మీ శ్రీమతికి బాగా నచ్చినవి?
ఆర్య-2, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తనకు బాగా నచ్చిన సినిమాలు.

మిమ్మల్ని బాగా నిరాశపరిచిన సినిమాలు?
బాగా నటించని ప్రతి సినిమా విషయంలో అసంతృప్తి ఉంటుంది. రేసుగుర్రం, దేశముదురు సినిమాలు నేను ఊహించిన దానికంటే ఎక్కువ విజయాల్ని సాధించాయి. ఆర్య-2, బద్రీనాథ్ సినిమాల్ని నమ్మి చేశాను. కానీ అనుకున్న ఫలితాన్ని అందించలేదు.

కథానాయకులకు ప్రతిభ ఉండి కూడా బాలీవుడ్‌పై దృష్టి సారించకపోవడానికి కారణమేంటి?
తెలుగులో కొనసాగుతూనే హిందీలో పెద్ద హీరో అవ్వాలంటే కుదరదు. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలంటే ఇక్కడి సినిమాలకు పూర్తిగా దూరమవ్వాలి. చాలా ఏళ్ల పాటు కష్టపడి నిర్మించుకున్న కెరీర్‌ను పణంగా పెట్టి హిందీ సినిమాలపై దృష్టిసారించాలి. చేయడం చాలా రిస్క్ అని నా అభిప్రాయం. అలాంటి త్యాగం చేసే గట్స్ ఉంటే తప్పకుండా ట్రై చేయవచ్చు. దగ్గర నుంచి చాలా మంది నటులు ఆ ప్రయత్నాలు చేసి విఫలయ్యారు. తెలుగులో కొనసాగుతూనే అప్పడప్పుడు ఒక్క సినిమా చేయడం ఉత్తమం.

Leave a Comment