నువ్వు జ్ఞాపకం కాదు… నువ్వే నా జీవితం

నా ఫ్రెండ్స్‌లో ఓ అమ్మాయి ఒకరోజు తన ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ లో పెట్టిన పిక్చర్‌ నాలో అలజడి సృష్టించింది. ఆ ఫోటోలో ముగ్గురు అమ్మాయిలున్నారు. అందులో వున్నా ఒక అమ్మాయి కళ్లలో ఏదో మాయ. నన్ను చూపు తిప్పుకోనివ్వ లేదు. ఎన్ని సార్లు ఆ ఫొటో చూశానో… ఎన్ని సార్లు షేర్‌ చేశానో నాకే తెలియదు. ఇంతలో నా ఫ్రెండ్‌ ఫోన్‌ చేసింది. ఏరా అన్ని సార్లు షేర్‌ చేస్తున్నావ్‌.. ఏంటి సంగతి అంది? తన గురించి అడిగాను. తనూ నా డిప్లొమో ఫ్రెండ్‌ అని చెప్పింది. ఫోన్‌ నంబరు అడగాలనుకున్నాను. రాత్రి నిద్ర పట్టలేదు. ఫోన్‌ చేసి తన నంబర్‌ తీసుకోవాలనిపిస్తోంది. మెసేజ్‌ చేశాను. తన రూపం కనురెప్పలకు అడ్డం పడుతోంది. అవి మూతపడటం లేదు. తెల్లారి ఫోన్‌ చూసుకుంటే తన నంబర్‌ మెసేజ్‌ వచ్చింది. నా ఫ్రెండ్‌కి ఫోన్‌ చేశాను. ‘ఒరే… నువ్వు మంచివాడివని… ఇంతకుముందెప్పుడు ఏ అమ్మాయి గురించి అడగలేదని…నీకు ఈ నంబర్‌ పంపాను. మిస్‌ బిహేవ్‌ చేయకు… మన ఫ్రెండ్‌షిప్‌ దెబ్బతింటుంద’ని హెచ్చరిక లాంటిది ఇచ్చింది. సరే అన్నాను. మనసంతా ఒకటే ఆందోళన. ఎన్నిసార్లు మెసేజ్‌ టైప్‌ చేసి డిలీట్‌ చేశానో నాకే తెలియదు. చివరికి రెండక్షరాలు హాయ్‌ అని టైప్‌ చేసి పంపాను. హూ ఈజ్‌ దిస్‌ అని రిప్లై వచ్చింది. అప్పుడప్పుడు మెసేజ్‌ చేస్తూ ఉండేవాణ్ని. ఆలస్యంగానైనా స్పందించేది. ఇంతలో నా బీటెక్‌ ఫైనలియర్‌ పరీక్షలు వచ్చాయి. పూర్తి చేశాను. మా ఫోన్‌ మెసేజ్‌లు కాస్తా… కాల్స్‌గా మారాయి. చాలా కబుర్లు చెప్పుకొనేవాళ్లం. తర్వాత నేను ప్రపోజ్‌ చేశాను. మూడురోజుల తర్వాత ఓకే చెప్పింది. ప్రేమలో ఉంటే ఎండ తడిపేస్తుంటుంది. వాన కాల్చేస్తుంటుంది. ఇప్పుడు అదే నా ఫీలింగ్‌. తన ప్రేమ ఇచ్చిన ఉత్సాహంతో నాకు బెంగళూరులో జాబ్‌ వచ్చింది. నెలలు సెకనుల్లా కరిగిపోతున్నాయి. ఎలాగైనా తనని కలవాలని నిర్ణయించుకున్నాను. తనది ఖమ్మం. నాది తిరుపతి. ఒకసారి సెలవు పెట్టి ఖమ్మం వస్తున్నానని చెప్పాను. రమ్మంది. అక్టోబర్‌ 31వ తేదీ అక్కడ దిగాను. తను ఫోన్‌చేసింది. నేను రాలేకపోయానని చెప్పాను. అంతే తన మాటలు మూగబోయాయి. ‘అప్పుడే బుంగ మూతి పెట్టకు! నేను ఇక్కడే ఉన్నాను. మనం కలుసుకోవాలనుకున్న చోటికి వచ్చేయ్‌’ అన్నాను. ఓకే అంది ఎంతో ఉత్సాహంగా… ఇద్దరం కలుసుకున్నాం. మా ఆనందానికి అవధుల్లేవు. తన ఒడిలో నేనున్నప్పుడు ఇక ఈ ప్రపంచంతో నాకు పనేంటి అనిపించింది. ఆ రోజు నా జీవితంలో అత్యంత మధురమైనదిగా నిలిచిపోయింది. తర్వాత నేను బెంగళూరుకు వెళ్లాను. తను ఇంటికి వెళ్లింది. ఇంతలో పిడుగులాంటి వార్త వాళ్ల నాన్నకు పక్షవాతం వచ్చింది. వాళ్లింటి భారం తనపై పడింది. తనే కుటుంబాన్ని పోషించాలి. చెల్లిని చదివించాల్సి వచ్చింది. నేనే అక్కడికి వెళ్దామంటే నా ఉద్యోగం కుటుంబానికి అవసరం. నువ్వే ఇక్కడి వచ్చేయ్‌… మీ కుటుంబాన్ని చక్కగా చూసుకుందాం. ఇద్దరం కష్టపడదాం అని చెప్పాను. తను వినలేదు. మా భారం నీకెందుకంది. క్రమంగా నాతో మాట్లాడటం తగ్గించింది. ఎన్ని సార్లు కాల్‌ చేసినా ఫోన్‌ ఎత్తలేదు. నేను ఖమ్మం వెళ్లాను. ఇంకెప్పుడు ఇటు రావద్దని చెప్పింది. నా గుండె బద్ధలైంది. ఆ ముక్కలు నా కన్నీళ్లై బెంగళూరు దాకా రాలిపోతూనే ఉన్నాయి. కొన్నాళ్లకు తన పరిస్థితి నాకర్థమైంది. తను వెళ్లిపోతే తన కుటుంబం ఏమవుతుందోనని ఆలోచించింది. చిన్నూ లేకుండా నేను బతకలేను. తన కోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తాను. చిన్నూ నువ్వు నాకు జ్ఞాపకం కాదు. జీవితం. నీ కోసం వేచిఉంటాను. నీ మాటలైనా వింటూ బతికేస్తాను…ఎప్పటికైనా నువ్వు కాల్‌ చేస్తావని ఎదురుచూస్తుంటాను.

Leave a Comment