Manjula Interview About Manasuku Nachindi Movie

‘‘ప్రేక్షకులకు కొన్ని కథలు అర్థం కావని మనకు మనమే అనుకోవడం పొరపాటు. వాళ్లు మనకంటే బాగా ఆలోచిస్తారు. ఇప్పుడు కావల్సింది కథాబలమున్న చిత్రాలే. ఒక దర్శకురాలిగా అలాంటి సినిమా తీయడం నా బాధ్యతగా భావించి ‘మనసుకు నచ్చింది’ తెరకెక్కించా’’ అన్నారు మంజుల ఘట్టమనేని. ప్రముఖ నటుడు కృష్ణ వారసురాలైన ఆమె నటిగా మెరిశారు. నిర్మాతగా కూడా నిరూపించుకొన్నారు. ‘మనసుకు నచ్చింది’తో ఇటీవల దర్శకురాలిగా మారారు. సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంజుల సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ…

దర్శకురాలిగా తొలి సినిమా అనుభవం గురించి ఏం చెబుతారు?
ఏ క్షణం కూడా కష్టంగా అనిపించలేదు. తొలి రోజే సెట్‌ మొత్తం నా చేతుల్లో ఉన్నట్టు అనిపించింది. బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసిన ఛాయాగ్రాహకుడు రవి యాదవ్‌ ‘పది సినిమాల అనుభవమున్న దర్శకురాలిగా పనిచేస్తున్నారు’ అన్నారు. దర్శకురాలిగా నా వరకు నేను పదికి పది మార్కులు వేసుకుంటా.

‘మనసుకు నచ్చింది’ ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమేనా?
ప్రేమకథ మాత్రమే కాదు… అంతమించిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ కథలో చాలా పార్శ్వాలు ఉంటాయి. ప్రకృతిది కీలకమైన పాత్ర. మనం మన మనసుతో కనెక్ట్‌ అవ్వడానికి ఇందులో ప్రకృతిని వాడాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథకి అదే కథానాయకుడు. ఈ సినిమా చూశాక సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూసి ఆస్వాదించాలనుకొంటారు. ప్రకృతికి మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌ చెప్పాడు. దాంతో సినిమాలో తను కూడా ఉన్నాడనే ఓ అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది.

ఈ కథ మీ మనసులోకి ఎలా వచ్చింది?
ప్రకృతిని ఆస్వాదించడం మొదలుపెట్టాకే (నవ్వుతూ). కాలంతో పరిగెడుతున్న మనందరి జీవితాల్లోనూ ఎక్కడో ఏదో ఒక మూల అలజడి, నైరాశ్యం తొంగి చూస్తుంటుంది. నేనెప్పుడైతే కాస్త ఆగి పక్షులు చేసే శబ్దాల్ని, పూల సువాసనల్ని, సూర్యోదయాల్ని, సూర్యాస్తమయాల్ని గమనిస్తూ ప్రకృతితో మమేకమయ్యానో… చిన్న చిన్న ఆనందాల్ని ఆస్వాదించడం మొదలుపెట్టానో అప్పట్నుంచి నా జీవితంలో చాలా మార్పు కనిపించింది. ఈ విషయాన్ని పదిమందితో చెప్పాలనిపించింది. అలాగని నేను ఊరికే కూర్చుని ప్రకృతిని చూడండి, హృదయంతో కనెక్ట్‌ అవ్వండని చెబితే ఎవ్వరూ వినరు. కథ చెప్పడం అనేది మనకు ఎప్పట్నుంచో ఉంది. కథ మన జీవితాల్లో ఓ భాగం. అందుకే నా హృదయంలో నుంచి వచ్చిన ఓ మంచి కథ, ఓ మంచి కాన్సెప్టుతో ‘మనసుకు నచ్చింది’ చిత్రం చేశా. సినిమా అంటే కచ్చితంగా వినోదమే. దాంతోపాటు ఏదో ఒక చిన్న మార్పు, ఒక్క క్షణం పాటు ‘అవును.. ఇది నిజమే’ అనిపించే ఓ మంచి విషయం ఉండాలి. అలాంటి సినిమానే ఇది.

నటీనటుల్లో ఎవర్నైనా దృష్టిలో ఉంచుకొని ఈ కథ రాసుకొన్నారా?
ఒకర్ని దృష్టిలో ఉంచుకొని, వారికి తగ్గట్టుగా కథ రాయడం నాకు నచ్చదు. కథ పూర్తయిన తర్వాతే ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించా. కథ సిద్ధమయ్యాక కొద్దిమందిని కలిశా. నిర్మాత కిరణ్‌ సందీప్‌కిషన్‌ పేరు చెప్పడంతో తనైతేనే బాగుంటుందని ఎంపిక చేసుకొన్నాం. నా జీవితంలో నేను చూసిన అబ్బాయిల శైలిని స్ఫూర్తిగా తీసుకొని ఆ పాత్రని తీర్చిదిద్దా. మహేష్‌ ఇంట్లో ఉన్నాడంటే అమ్మ జుట్టుకో, నా జుట్టుకో ఉన్న రబ్బర్‌బ్యాండ్‌ తీయడం, సరదాగా చిరాకు పెట్టడం చేస్తుంటాడు. అలాంటి లక్షణాలు కథానాయకుడి పాత్రలో కనిపిస్తాయి. కథానాయిక నిత్య పాత్రలో అయితే నేనే కనిపిస్తా (నవ్వుతూ). మా అమ్మాయి జాన్వి ఓ కీలకమైన పాత్రలో నటించింది.

అసలు దర్శకత్వంపై మనసు ఎప్పుడు మళ్లింది? మీ అభిప్రాయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు?

మొదట్నుంచీ దర్శకత్వంపైనే ప్రేమ నాకు. అయితే భాషపై పట్టులేదు. సినిమాల్లో కూడా సాధారణమైన భాషే కదా అని ధైర్యం తెచ్చుకొని కథ రాసేశా. ఆ కథకి యేడాది పట్టింది. మరో ఆరు నెలలు రచయిత బుర్రా సాయి ధరమ్‌తో కలిసి స్క్రిప్టుని తీర్చిదిద్దా. దర్శకత్వం గురించి నా అభిప్రాయాన్ని చెప్పగానే నా భర్త సంజయ్‌ ప్రోత్సహించారు. నాన్నకి చెబితే ఆయన థ్రిల్‌ అయ్యారు. నాన్న నటించిన ‘తెలుగువీర లేవరా’ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేశాను కూడా. మహేష్‌కి చెబితే ‘దర్శకత్వం చేయడం ఎంత కష్టమో తెలుసా?’ అన్నాడు. కానీ నా ఆలోచనల్ని విన్నాక తనకి నమ్మకం కలిగింది. ట్రైలర్‌ చూశాక తను షాక్‌ అయ్యాడు.

మహేష్‌బాబు కోసమైతే ఎలాంటి కథని సిద్ధం చేస్తారు?
తనకి ఎలాంటి కథ రాయాలని ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎలాంటి కథలోనైనా ఒదిగిపోగలడు. కాకపోతే తన ఇమేజ్‌ గురించే ఆలోచించాలి. తన ఇమేజ్‌కి తగ్గ కథైతే తనే పిలిచి సినిమా చేయమంటాడేమో. ఆ రోజు వస్తుందని నా నమ్మకం.

పాటల వేడుకలో పవన్‌కల్యాణ్‌ కోసం కథ సిద్ధం చేశానని అన్నారు కదా…
కథానాయకుడుగా ఆయన ఇప్పుడొక స్థాయిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వెళుతున్నాడంటే ప్రజాసేవ చేయాలనే తపన మనసులో ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ కోణంలో పవన్‌కల్యాణ్‌కి మాత్రమే సరిపడే కథ నా దగ్గరుంది. అందుకే ఆ మాట చెప్పా.

Leave a Comment