Subhalekha Sudhakar and SP Sailaja Special Interview

ఒకరు ‘శుభలేఖ’ను తన ఇంటి పేరుగా మార్చుకొన్నారు. మరొకరు పుట్టింటి పేరుతోనే కీర్తి పొందారు. ఒకరు పాడుతుంటే అందమైన కోయిల పాడుతున్నట్లే ఉంటుంది. మరొకరు నటిస్తుంటే కనుల విందుగా చూస్తుండిపోతాం. వారే శుభలేఖ సుధాకర్‌.. ఎస్పీ శైలజ. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే కార్యక్రమానికి విచ్చేసిన ఈ జంట తెర వెనుక.. ముందు జరిగిన సంగతులకు కాస్త, హాస్యం.. మరికాస్త చిలిపిదనం జోడించి పంచుకున్నారు.
టామ్‌ గారు.. జెర్రీగారు ఎలా ఉన్నారు?

ఎస్పీ శైలజ:టామ్‌గారు బాగున్నారు.
శుభలేఖ సుధాకర్‌: జెర్రీగారు ఇలా ఉన్నారు (నవ్వులు)

మీరు ఇంట్లో ఆయన్ను ఎలా పిలుస్తారు?
ఎస్పీ శైలజ: ఎవరికైనా చెప్పేటప్పుడు సుధాకర్‌గారు అని చెప్తాను. పిల్లలు పుట్టిన తర్వాత వేరేలా ఉంటుంది. మా అబ్బాయి పేరు శ్రీకర్‌. వాళ్ల ఫ్రెండ్స్‌ వచ్చి శ్రీకర్‌ అప్పా ఉన్నారా? అని అడుగుతుండేవాళ్లు. అలా అలవాటై నేను కూడా ‘నాన్నా’ అని పిలుస్తుంటా.

మీరు సుధాకర్‌.. మీ అబ్బాయి పేరు శ్రీకర్‌ కావాలని పెట్టారా?
శుభలేఖ సుధాకర్‌: తను ఎనిమిది నెలల చిన్నారిగా ఉండగా తిరుపతి వెళ్లాం. ఎలా జరిగిందో తెలియదు. మేము ఆలయం లోపలికి వెళ్లిన తర్వాత వాడు పాక్కుంటూ స్వామి దగ్గర వరకూ వెళ్లిపోయాడు. దాంతో వెంకటేశ్వరస్వామి పేరు వచ్చేలా శ్రీకర్‌ అని పెట్టాం.
ఎస్పీ శైలజ:ఈయన పేరు సుధాకర్‌.. వీళ్ల బ్రదర్‌ పేరు మురళీధర్‌.. ఇంకో బద్రర్‌ పేరు విద్యాసాగర్‌.. మా అబ్బాయికి శ్రీకర్‌ అని పెడితే బాగుంటుందని అలా కూడా ఆలోచించి పెట్టాం.

మరి ఆమెను మీరు ఏమని పిలుస్తారు?
శుభలేఖ సుధాకర్‌: అమ్మలు.

మీ మ్యారేజ్‌ ఏ సంవత్సరం అయింది?
శుభలేఖ సుధాకర్‌: 1989. రజనీకాంత్‌గారి రాఘవేంద్ర కల్యాణ మండపంలో జరిగింది.

‘శివ’కు ముందే జరిగిందా?
శుభలేఖ సుధాకర్‌: ‘శివ’ అప్పటికి విడుదలైంది. ఎంగేజ్‌మెంట్‌ అప్పుడు షూటింగ్‌ జరుగుతోంది. నవంబరులో సినిమా విడుదలైంది. డిసెంబరులో మా పెళ్లి జరిగింది.

‘శివ’ చూశాక ఆయన్ను పెళ్లి చేసుకున్నారా? అంతకుముందే చూశారా?
శుభలేఖ సుధాకర్‌: ఇది తిరకాసైన ప్రశ్న. లవ్‌ ఉందా? అని అడుగుతున్నారు? అదేం లేదు. మాది పెద్దలు నిశ్చయించిన పెళ్లి. (తనని తానే చూపించుకుంటూ) ఈ మొహాన్ని ఎవరు లవ్‌ చేస్తారు?

సుధాకర్‌గారిది వైజాగ్‌.. శైలజగారిది చెన్నై.. ఎలా కలిశారు?
శుభలేఖ సుధాకర్‌: నిర్మాత ఏడిద నాగేశ్వరరావుగారి ఇంటి పక్కనే బాలుగారి ఇల్లు ఉండేది. అప్పుడు ‘సితార’ షూటింగ్‌ జరుగుతుండగా శైలజ అక్కడకు వచ్చింది. దర్శకుడు వంశీ, శైలజ ఇద్దరూ పుస్తకాలు మార్చుకునేవారు. అప్పుడు చూశా.
శైలజ: ఫస్ట్‌ అప్పుడే చూశారా?

శుభలేఖ సుధాకర్‌:1977లోనే చూశా. అయితే అప్పుడు నువ్వెవరో కూడా తెలియదు కదా!
శైలజ: 1977లో వైజాగ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లాం. వీళ్ల నాన్నగారు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు నేను స్టేజ్‌పై పాడుతుంటే ఫస్ట్‌ టైమ్‌ చూశారట. ఆ ఏడాదే నేను తొలిసారి ఒకే ఒక పాట పాడా. ఆ పాటలో నటించింది దర్శకుడు తేజ అనుకుంటా. అందులో చిన్న పిల్లాడిలా చేశారు. (మధ్యలో అలీ మాట్లాడుతూ.. మీరు పాటలు పాడటం ప్రారంభించి గతేడాదికి 40 ఏళ్లు అయింది.. నిజంగా గ్రేట్‌)

ఎన్ని పాటలు పాడి ఉంటారు?
ఎస్పీ శైలజ: తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 6వేల పాటలు పాడా.

సుధాకర్‌గారితో పెళ్లవుతుందని మీరెప్పుడైనా అనుకున్నారా?
ఎస్పీ శైలజ: అస్సల్లేదండీ! నా ఎంగేజ్‌మెంట్‌ రోజు వరకూ నాకు తెలియదు. నిద్ర లేపి ఇవాళ నీ ఎంగేజ్‌మెంట్‌ అని చెప్పారు.

బాలుగారు మిమ్మల్ని లైక్‌ చేస్తారా? లేక మీరు బాలుగారిని లైక్‌ చేస్తారా?
ఎస్పీ శైలజ: రెండూ సమానమే.

మీరు బాలుగారిని ఎక్కడ చూశారు?
శుభలేఖ సుధాకర్‌: దర్శకులు కె.విశ్వనాథ్‌గారి అమ్మాయి పెళ్లిలో తొలిసారి బాలుగారిని కలిశా. సర్‌! అని పిలిచేవాడిని. ఆయనకు ఓ చెల్లెలు ఉందని కూడా అప్పటికి నాకు తెలియదు.

బాలుగారు మీలో ఏ క్వాలిటీస్‌ చూశారు?
శుభలేఖ సుధాకర్‌: నాకు తెలియదు. బాలుగారి ఫ్రెండ్సందరూ నాకూ ఫ్రెండ్స్‌. 1985లో తొలిసారి పెళ్లి టాపిక్‌ వచ్చింది. అప్పట్లో జంధ్యాలగారు తీస్తున్న ‘పడమటి సంధ్యారాగం’ కోసం బాలుగారు, శైలజ యూఎస్‌ వెళ్లారు. శైలజకు పెళ్లి చేయాలనుకుంటున్నామని జంధ్యాలగారితో బాలుగారు అన్నారట. అప్పుడాయన నా పేరు సూచించారు. అప్పటి నుంచి ఆయన స్నేహితులు కూడా నాతో ఫ్రెండ్‌షిప్‌ చేయడం ప్రారంభించారు. 1989లో పెళ్లి అయింది. అప్పుడు బాలుగారు ‘వీళ్లెవరో తెలుసా’ అని అడిగారు. ‘మీ ఫ్రెండ్స్‌ సర్‌’ అన్నాను. ‘కాదు జాసూస్‌లు. నీ గురించి కనుక్కొని నాకు చెప్పారు’ అన్నారు. (నవ్వులు)

పెళ్లయ్యాక కూడా ‘ఎస్పీ శైలజ ’అని ఎందుకు కొనసాగిస్తున్నారు?
శైలజ: వాళ్ల ఇంటి పేరు కూడా ఎస్‌ అనే వస్తుంది. సూరావజ్జుల వాళ్లు. మాది ఎస్పీ. పీ ఒక్కటే ఎక్స్‌ట్రా ఉంది. పాస్‌పోర్ట్‌లో ఎస్పీ శైలజ అని ఉంది. దాన్ని మార్చాలంటే అదో పెద్ద ప్రక్రియ. అంతేకాకుండా ఎస్పీ శైలజ అందరికీ బాగా తెలిసిన పేరు. ఆయన ‘శుభలేఖ’ సుధాకర్‌గా ఎలా ఫేమస్సో నేను కూడా ఎస్పీ శైలజగా ఫేమస్‌. పైగా అప్పటికే గుర్తింపు రావడంతో అదే పేరును కొనసాగించాం.

శుభలేఖ సుధాకర్‌: కెరీర్‌ పరంగా తీసుకున్నా. నాకన్నా ఈమె సీనియర్‌. అదో గౌరవం. ఆ పేరును అలాగే ఉంచేయాలనుకున్నాం. ‘ఇంటిపేరును మార్చాలా’ అని అడిగింది కూడా. నేను వద్దు అని చెప్పా. దాని గురించి మా నాన్నగారు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

మీ జంట చాలామందికి ఆదర్శం. మీలోని టామ్‌ అండ్‌ జెర్రీలు ఎప్పుడైనా బయటకు వచ్చాయా?
శైలజ: రోజూ వస్తాయి, ఎందుకు రావు.
శుభలేఖ సుధాకర్‌: అవన్నీ ఇంట్లోనే. మా మధ్య అభిప్రాయ భేదాలున్నా అవి గోడదాటి బయటకు రావు. అలాగే కొనసాగిస్తూ వస్తున్నాం.

‘ద్రోహి’ సినిమా మీ ఇద్దరూ కలిసి చూశారు కదా! మీ రియాక్షన్‌ ఏంటి?
ఎస్పీ శైలజ: ఆ సినిమా చూస్తే నాకొకరకమైన భయం. అంతవరకూ శుభలేఖ సుధాకర్‌ అంటే మంచి అబ్బాయి.. సాఫ్ట్‌ క్యారెక్టర్లు చేస్తాడు అనే ఆలోచన ఉండేది. అయితే ఇతనిలో ఇన్ని కళలు ఉన్నాయా? అని ఆ సినిమా చూసే వరకూ తెలియదు (నవ్వులు). ఆ సినిమా ప్రివ్యూకి మేమందరం వెళ్లాం. ‘అది నెగిటివ్‌ క్యారెక్టర్‌. నువ్వు టెన్షన్‌ పడకు. సినిమాను సినిమాలా చూడు’ అని ఈయన చెబుతూనే ఉన్నారు. ప్రివ్యూకి విశ్వనాథ్‌గారు, కమల్‌హాసన్‌గారు ఇలా అందరం వెళ్లాం. అందులో ఒక సన్నివేశంలో చిన్నపిల్లను పట్టుకుని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. సుతరామూ అది నాకు నచ్చలేదు. ఇంకో సన్నివేశంలో గౌతమిగారు ఈయనను కాల్చాలి. నేను సినిమాలో పూర్తిగా లీనమైపోయి.. ‘కాల్చు.. వాడిని కాల్చు..’ అని థియేటర్‌లో అరిచేశా. పక్కనే ఉన్న విశ్వనాథ్‌గారు అలా నన్ను చూస్తూ ఉండిపోయారు.

బాలు గారంటే మీకెందుకు అంత భయం?
శుభలేఖ సుధాకర్‌: ఆయనో లెజెండ్‌. ఆయన టాలెంట్‌.. విద్య ముందు మేమంతా నథింగ్‌. అది మీరు భయమనుకోండి.. భక్తి అనుకోండి.. మర్యాదనుకోండి.. ఆయన మీద నాకు ఉన్న గౌరవం. (మధ్యలో శైలజ అందుకుని ఇప్పటికీ సర్‌ అనే పిలుస్తారు). ఆయన చెల్లెలిని పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఏదైనా పొరపాటు చేస్తే శుభలేఖ సుధాకర్‌ తప్పు చేశాడు అనరు. బాలుగారి బావమరిది తప్పు చేశాడని అంటారు. నాకో బాధ్యత ఉంది.
ఆయన పుట్టిన రోజుకు మీరు ఏం గిఫ్ట్‌ ఇస్తారు?
ఎస్పీ శైలజ: పెర్‌ఫ్యూమ్‌ ఇచ్చానండీ! (మధ్యలో అలీ అందుకుని బ్లాక్‌ లేయర్‌ (మందు సీసా) అంటారా ఆ పెర్‌ఫ్యూమ్‌ పేరు.. అందరూ నవ్వులు). అవన్నీ చెప్పకూడదండీ. అన్నయ్యతో పాటు వివిధ షోలకు అమెరికా వెళ్తుంటాం. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మందు బాటిళ్లు పట్టుకురావడమే నా పని అయిపోయింది. అందరూనేమో నేను తాగడానికి తెచ్చుకుంటున్నానని అనుకుంటారు. చచ్చే సిగ్గు. అదంతా మా వారి కోసమే.

శుభలేఖ సుధాకర్‌: ఇంత అర్థం చేసుకునే భార్య ఎవరికైనా దొరుకుతుందా? చెప్పండి.

ఆవిడ పుట్టిరోజుకు మీరు ఏం గిఫ్ట్‌ ఇస్తారు?
శుభలేఖ సుధాకర్‌: గులాబీ పూలు ఇస్తా. ఆమెకు అవంటే చాలా ఇష్టం.అయితే నేను ఒకే ఒక పొరపాటు చేశా!

ఏం పొరపాటది?
శుభలేఖ సుధాకర్‌: పెళ్లైన మొదటి సంవత్సరం హైదరాబాద్‌ వచ్చా. వెళ్తూ వెళ్తూ ఒక చీర కొని తీసుకెళ్లి ఇచ్చా. మళ్లీ మూడు నెలల తర్వాత హైదరాబాద్‌ వస్తే మళ్లీ చీర కొని ఇచ్చా. ఆ తర్వాత అయిదు నెలలకు మళ్లీ వచ్చా. పెళ్లిరోజు దగ్గర పడుతుండటంతో మళ్లీ చీరకొన్నా. ‘నాకు తెలుసండి.. చిన్న చిన్న డిజైన్‌లతో ఉన్న చీరలంటే మీకు ఇష్టమని. కానీ, ఒకే చీర నాలుగుసార్లు ఇవ్వడం బాగోలేదు’ అని అంది. (మధ్యలో అలీ అందుకుని.. ఒక చీర మీకోసం తెచ్చారు. మరో చీర ఇంకో ఆవిడకు ఇద్దామని తెస్తే.. ఆవిడ తీసుకోలేదు)

ఎస్పీ శైలజ: ఇక్కడకు వచ్చాక మా మధ్య ఏం పెట్టకండి. అలీ మంచి అబ్బాయి అని ఈ కార్యక్రమానికి వచ్చా. ముచ్చటగా ఉన్నారు కదాని ఇద్దరి మధ్యా గోడలు కడతారా!!

ఒక మ్యాగజైన్‌లో మీరు ఇద్దరూ విడిపోయారని అప్పట్లో వార్త హల్‌చల్‌ చేసింది?
ఎస్పీ శైలజ: ఇప్పటికీ అనుకుంటారు.

శుభలేఖ సుధాకర్‌: ఇదే స్టూడియోలో ‘ఈశ్వర్‌ అల్లా’ షూటింగ్‌ జరుగుతోంది. ఆ మ్యాగజైన్‌ మీరు చదివి నాకు చూపించారు. నాకు మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఇంతకీ ఆ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్న ఏంటంటే? ‘మీరూ.. శైలజగారు విడిపోయారని నేను ఓ తమిళ మ్యాగజైన్‌లో చదివా? అది నిజమేనా?’ అని అడిగారు. ‘మీరు నాతో పాటు రండి. చెన్నై తీసుకెళ్తా. మీరు శైలజని చూస్తే మీ అనుమానం తీరిపోతుంది. అయితే అదే సమయంలో ఆమె షాపింగ్‌కి వెళ్తే మీరు నిజం అనుకోవచ్చు’ అని సమాధానమిచ్చా.

ఎస్పీ శైలజ: అలా జరిగింది కూడా. ఒక రాత్రి ఓ అభిమాని నాకు ఫోన్‌ చేసింది. ‘మేడమ్‌ బాగున్నారా? అన్నయ్యగారు ఎలా ఉన్నారు?’ అని అడిగింది. అన్నయ్య అంటే నేను బాలుగారు అనుకున్నా. ‘అన్నయ్యగారు ఇక్కడెందుకు ఉంటారమ్మా వాళ్ల ఇంట్లో ఉంటారు? అన్నా’. ‘అయితే నేను విన్నది నిజమేనా మీరు విడిపోయారా’ అని అడిగింది. అమ్మా! అన్నయ్యగారు అంటే బాలుగారు అనుకున్నా.. నువ్వు అనుకున్న అన్నయ్యగారు మా ఆయన శుభలేఖ సుధాకర్‌గారు నా పక్కనే ఉన్నారు మాట్లాడు అని ఫోన్‌ ఈయనకు ఇచ్చా!

ఇంకోసారి తిరుపతి వెళ్లాం. అక్కడ షూటింగ్‌ జరుగుతోంది. ఈయన రైల్వే స్టేషన్‌కు వచ్చి మమ్మల్ని రిసీవ్‌ చేసుకున్నారు. బాబుని, లగేజీ తీసుకుని ఈయన ముందు వెళ్తుంటే.. నేను వెనకాలే వస్తున్నా. మధ్యలో ఆడవాళ్లు ‘శుభలేఖ సుధాకరే. పాపం వాళ్లు విడిపోయారట’ అని మాట్లాడుకుంటున్నారు. నేను ఆవిడను పిలిచి ‘అవునా అమ్మా! వాళ్లు విడిపోయారా?’ అని అడిగా!(నవ్వులు) అది జరిగి చాలా రోజులైనా, ఇప్పటికీ అది మచ్చగానే ఉంది. ఎవరెలా అనుకుంటే మాకేంటి మేము హాయిగానే ఉన్నాం కదా!

శుభలేఖ సుధాకర్‌: నేను, శైలజ, బాలుగారు ఇలాంటివి పెద్దగా పట్టించుకోం. కానీ నా పేరెంట్స్‌, బంధువులపై అది బాగా ప్రభావం చూపింది.

శైలజ గారూ మీకు కోపం వస్తే లెటర్‌ రాసి పెడతారట?
ఎస్పీ శైలజ: నాకు కోపం వస్తే మాట్లాడను. మాట్లాడితే మాటా మాటా పెరుగుతుంది. అందుకే ఏదో ఒక పని పెట్టుకుంటా.
శుభలేఖ సుధాకర్‌: ఆవిడకు కోపం వస్తే అక్కడ వస్తువులు ఇక్కడకు.. ఇక్కడ వస్తువులు అక్కడకు మారుస్తూ ఉంటుంది. మనమే అర్థం చేసుకోవాలి.

మీరు సింగర్‌గా బాగా బిజీగా ఉన్న రోజుల్లో డబ్బింగ్‌ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఎస్పీ శైలజ:నాకు డబ్బింగ్‌ అస్సలు ఐడియా లేదు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రానికి రాధికగారికి కొత్త వాయిస్‌ కోసం వెతుకుతున్నారు. శైలజగారితో చెప్పిద్దామని అనుకున్నారు. నాతో డబ్బింగ్‌ చెప్పించిన తర్వాత ‘మరీ లేతగా ఉంది. సూట్‌ కాదు’ అన్నారు. నాకు కోపం వచ్చింది. ‘నేను అడిగానా? నన్ను తీసుకెళ్లి డబ్బింగ్‌ చెప్పించి వద్దంటారా’ అని అన్నా! ఆ తర్వాత మళ్లీ ‘మీ వాయిసే బాగుంది’ అని మిగిలిన సినిమాకు నాతోనే డబ్బింగ్‌ చెప్పించారు. ఆ తర్వాత ‘వసంతకోకిల’లో శ్రీదేవికి చెప్పించారు. అది బాగా మ్యాచ్‌ అయింది.

శుభలేఖ సుధాకర్‌: ఇక్కడ పెద్ద సర్‌ప్రైజ్‌ ఏంటంటే? వాల్‌డిస్నీ వాళ్లు ‘జురాసిక్‌పార్క్‌’కి డబ్బింగ్‌ కోసం చాలామందిని అడిగారు. జగ్గయ్యగారి వాయిస్‌ కూడా వాళ్లు తీసుకోలేదు. కానీ, శైలజను డబ్బింగ్‌ చెప్పమన్నారు.

‘సాగర సంగమం’లో మిమ్మల్ని ఎలా ఎంపిక చేశారు? కమల్‌హాసన్‌తో నటించడం ఎలా అనిపించింది
ఎస్పీ శైలజ:ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుండగా నేను భరతనాట్యం అరంగేట్రం చేశా. దానికి విశ్వనాథ్‌గారు, ఏడిద నాగేశ్వరరావు గారు అందరూ వచ్చారు. ఆ ఫొటోలు చూసి ఈ క్యారెక్టర్‌కు నేనైతే బాగుంటుందని అనుకున్నారట. అన్నయ్యను అడిగారు. నేను మాత్రం ససేమిరా అన్నా. ఆ తర్వాత వాళ్లు వేరే అమ్మాయిని కూడా అనుకుని హిమబిందు అని పేరు కూడా పెట్టేశారు. అయితే విశ్వనాథ్‌గారికి మాత్రం నాతోనే చేయించాలని ఉండేది. దాంతో ఆయన మా నాన్నగారిని కలిసి ఒప్పించారు. అయితే బాలుగారు మాత్రం ఒక షరతు పెట్టారు. ‘తనకుండే పాట మాత్రం తనే పాడుకుంటుంది’ అని అన్నారు. అంతా ఓకే అయింది. నేను ఇష్టం లేకుండా చేశానో.. నాకు అవగాహన లేకుండా చేశానో ఆ పాత్రకు అది సరిపోయింది. ఫస్ట్‌ షూటింగ్‌ రవీంద్రభారతిలో జరిగింది. మేకప్‌ వేసి అంతా సిద్ధం చేశారు. కమల్‌హాసన్‌ ముందు నేను ఏం చేస్తాను? అని వెనక్కి వచ్చేసి ‘అన్నయ్యా నా వల్ల కాదు. ఇంకొకరిని పెట్టుకోండి’ అని చెప్పేశా. ఏడిద నాగేశ్వరరావుగారు కంగారు పడిపోయారు. ఇంతలో విశ్వనాథ్‌గారు వచ్చి ‘ఫస్ట్‌ నువ్వు ఒక షాట్‌ చెయ్‌! జనం అభినందించకపోతే తీసేస్తా’ అన్నారు. జనాలను పెట్టించారో ఏమో తెలియదు. ఫస్ట్‌షాట్‌కు అందరూ చప్పట్లు కొట్టారు.(నవ్వులు) ఆ క్రెడిట్‌ అంతా విశ్వనాథ్‌గారిది.
మీరు నెల్లూరులో పుట్టారు.. చెన్నైలో పెరిగారు.. మరి తెలంగాణ పాట ‘లాలూ దర్వాజకాడికి రబ్బరు గాజులు’ అంత గొప్పగా ఎలా పాడగలిగారు?
ఎస్పీ శైలజ: అది కీరవాణిగారు.. సాహితి గారి గొప్పతనం. నన్ను కూర్చోబెట్టి.. ఈ పదం ఇలా పలకాలి. ఇక్కడ ఇలా విరుపులు ఉండాలి… అని నేర్పించారు.

ఆవిడ పాడిన పాటల్లో మీకు నచ్చిన పాట ఏది?
శుభలేఖ సుధాకర్‌: తమిళ ‘జానీ’ సినిమాలో ‘ఆశయ కాకుల తూదవిట్టు’ అన్న పాటంటే ఇష్టం. ఒక్కసారి పాడవా?

ఎస్పీ శైలజ: ఈ పోగ్రామ్‌లో కేవలం మాటలనే చెప్పారు. ఆయన సంగతి మీకు తెలియదు. ఈ జానీ అనే పాట ఆయనకు రామనామ జపంలా నేను పాడుతూనే ఉంటాను.. ఆయన వింటూనే ఉంటారు.

సైకిల్‌ మీకోసం తెచ్చారా? చరణ్‌ కోసం తెచ్చారా?
ఎస్పీ శైలజ: సైకిల్‌ చరణ్‌(బాలుగారి కుమారుడు) కోసమే తెచ్చారు. కానీ, అది ఎక్కువ వాడేది నేనే. అయితే దాన్ని మీరు (అలీ) విరగ్గొట్టేశారు. నాకు ఇంకా గుర్తు. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు గేటు పట్టుకుని వూగుతూ ఉండేవారు.(నవ్వులు)

ఒకనొక టైమ్‌లో బ్యాంకు బాలెన్స్‌ రూ.500 మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. ఇది నిజమేనా?
ఎస్పీ శైలజ: నిజమే! ఏది ఉన్నా అది మా మధ్యలోనే ఉంచాలని అనుకున్నాం. పెద్దవాళ్లకు ఎవరికీ చెప్పకూడదు. సాధ్యమైనంతవరకూ సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అయితే డబ్బు కావాలంటే.. అన్న దగ్గరకు వెళ్లినా, అత్తమామలు దగ్గరికి వెళ్లినా ఇస్తారు. అయితే మాకు ఆ ఉద్దేశం లేదు. ఆ సమయంలో మాకు అవకాశాలు లేవు. అంతేకాకుండా నాకు డెలివరీ టైమ్‌. ఇలాంటి పరిస్థితులు అందరికీ వస్తాయి. ఇదే శాశ్వతం అనుకున్నప్పుడు ‘అది కాదు.. ఇంకొకటి ఉంది. దీన్ని మీరు ఫేస్‌ చేయాలి. అప్పుడే మీరు అప్‌గ్రేడ్‌ అవుతారు’ అని చెప్పడానికి కొన్ని పరిస్థితులు మనకొస్తాయి. అందుకు ఇదో ఉదాహరణ. అందరూ చెబుతారు. ‘డబ్బుది ఏముంది. ఇవాళ వస్తుంది రేపు పోతుంది’ అని. ఇవాళ వస్తుందేమో.. ఇవాళ పోతుందేమో.. రేపు కావాలంటే రాదు.. డబ్బు ఒక మంచి ఎనర్జీ. దాన్ని ఎంత శ్రద్ధగా వాడుకుంటే నువ్వు బాగుంటావ్‌.. నలుగురినీ బాగు చేయొచ్చు. పిల్లలకు చెప్పేది ఒక్కటే. డబ్బును గౌరవించండి. మీ దగ్గర పది రూపాయలుంటే అయిదు రూపాయిలే ఖర్చు చేయండి. అది మిమ్మల్ని, మీ చుట్టుపక్కల వాళ్లను కాపాడుతుంది.

Leave a Comment