Tholi Prema Telugu Movie Review

చిత్రం: తొలిప్రేమ
నటీనటులు: వరుణ్‌తేజ్‌.. రాశీఖన్నా.. సపనా పబ్బి.. ప్రియదర్శి.. సుహాసిని.. విద్యుల్లేఖ రామన్‌.. హైపర్‌ ఆది తదితరులు
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాత: బి.వి.ఎన్‌.ఎస్‌. ప్రసాద్‌
డిస్ట్రిబ్యూషన్‌: శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేదీ: 10-02-2018
నేటితరం యువ కథానాయకుల్లో వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుంది. ‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్‌’ ఇలా వేటికవే ప్రత్యేకం. గతేడాది శేఖర్‌కమ్ములతో కలిసి ప్రేక్షకులను‘ఫిదా’ చేశారు. ఇప్పుడు ‘తొలిప్రేమ’ అంటూ మరో ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. పవన్‌కల్యాణ్‌ తొలినాళ్లలో నటించిన ‘తొలిప్రేమ’ టైటిల్‌నే ఈ చిత్రానికీ పెట్టడంతో సినిమాపై కాస్త హైప్‌ వచ్చింది. ఇక ‘బాబాయ్‌ టైటిల్‌ను చెడగొట్టం. ఆ టైటిల్‌కు గౌరవం తెస్తాం’ అని వరుణ్‌తేజ్‌ ధీమా వ్యక్తం చేయడం సినిమాపై అంచనాలను పెంచింది. ‘జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి. మోయకతప్పదు’ అంటూ ట్రైలర్‌లో చెప్పడం ఇదో ఫీల్‌గుడ్‌ ప్రేమకథ అని చెప్పకనే చెప్పారు. అయితే కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉంది? వరుణ్‌ తేజ్‌ కెరీర్‌కు ‘తొలిప్రేమ’ ఎలాంటి ఊతాన్ని ఇచ్చింది?

కథేంటంటే: ఆదిత్య(వరుణ్‌ తేజ్‌) ఒక రైలులో వర్ష(రాశీఖన్నా)ను చూస్తాడు. తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అనుకోకుండా వీరిద్దరూ ఒకే కళాశాలలో చేరతారు. తనను ప్రేమించాలంటూ ఆదిత్య.. వర్ష వెంట పడుతూ ఉంటాడు. క్రమక్రమంగా ఆదిత్య ప్రేమలో పడుతుంది వర్ష. ఆదిత్యకి కోపం ఎక్కువ. దేనికైనా ముందు గొడవపడి తర్వాత ఆలోచిస్తాడు. కానీ, వర్ష అలా కాదు. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. వీరిద్దరి మధ్య ఈ తేడానే గొడవలకు కారణమవుతుంది. దీంతో ఆదిత్య-వర్ష విడిపోతారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత లండన్‌లో ఇద్దరూ కలుసుకుంటారు. అక్కడ వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది?ఒకరి మీద ఒకరికి కోపం తగ్గిందా? అన్నదే కథ.

ఎలా ఉందంటే: కథలో కొత్త విషయాలు అంటూ ఏమీ ఉండవు. ఇద్దరు ప్రేమికులు విడిపోయి మళ్లీ కలుసుకోవడం అన్నది చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా అలాంటి కథే. ఇగో-కోపంతో కొట్టుమిట్టాడే ఓ జంట కథ ఇది. అయితే ఈ అంశాన్ని యువతరానికి నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు. హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు ఈ కథకు బలం. వాటి చుట్టూనే వినోదం, డ్రామా, భావోద్వేగాలు పలికించాడు. కాలేజీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వర్ష.. ఆదిత్యకి ప్రపోజ్‌ చేసే సన్నివేశం, ఆదిత్య కాలేజీ అమ్మాయిలను అక్కా.. అని పిలిచే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆదిత్య-వర్ష మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇదే ఈ సినిమాను చివరి వరకు నడిపించింది. ద్వితీయార్ధం అంతా భావోద్వేగాలతో సాగుతుంది. కథానాయకుడు, నాయిక కలిసిపోతారని ముందే ప్రేక్షకులు ఊహిస్తారు. కానీ, చివరి వరకూ ప్రేక్షకులను కుర్చీలో కూర్చోబెట్టాడు దర్శకుడు. వరుణ్‌తేజ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లు కొన్ని యాక్షన్‌ సన్నివేశాల మేళవింపు ఆకట్టుకుంది. పతాక సన్నివేశాలను ఇంకాస్త బాగా, బలంగా రాసుకోవాల్సింది.

ఎవరెలా చేశారంటే: కోపం-ప్రేమ కలగలిపిన యువకుడిగా వరుణ్‌ నటన ఆకట్టుకుంది. అతని రెండు గెటప్‌లు యూత్‌కు నచ్చేవే. చాలా సహజంగా నటించాడు. తన కెరీర్‌లోనే బెస్ట్‌ అనుకునేలా రాశీఖన్నా నటించింది. ఈ సినిమాలో ఆదిత్య పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో వర్ష పాత్రకూ అంతే. ఈ పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసింది రాశీఖన్నా. హైపర్‌ ఆది, ప్రియదర్శి, నరేశ్‌ నవ్విస్తారు. సుహాసినికి ఓ మంచి పాత్ర దక్కింది. తమన్‌ పాటలు మెలోడీ పరంగా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. దర్శకుడు సంభాషణలను చక్కగా రాసుకున్నాడు. ప్రేమ, కోపం, కులానికి సంబంధించి అతను రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఓ రొటీన్‌ స్టోరీని యువతరానికి నచ్చేలా తెరకెక్కించాడు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది.

బలాలు

+ వరుణ్‌, రాశీఖన్నా కెమిస్ట్రీ

+ సంభాషణలు

+ సంగీతం

బలహీనతలు

– స్లో నెరేషన్‌

చివరిగా: యువతరానికి నచ్చే ‘తొలిప్రేమ’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Leave a Comment