Big Boss season 2 Telugu Nani Press Meet

అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్‌బాస్‌’ తెలుగు షో సీజన్‌ 2 జూన్‌ 10 నుంచి ప్రారంభం కాబోతోంది. ‘నేచురల్‌ స్టార్‌’ నాని ఈసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో సీజన్‌-1కు ‘యంగ్ ‌టైగర్‌’ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా అలరించారు. ఇప్పుడు నాని ఎలా ఆకట్టుకోనున్నారనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది.‌ ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాని పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ విశేషాలివి..

* ఎన్టీఆర్‌ను మించి మీరు‌ ఉండాలని ప్రేక్షకులు ఊహిస్తుంటారు. మీపై ఆ ఒత్తిడి ఎలా ఉంది?
‘‘ఇది ఓ ఛాలెంజ్‌. ఎక్కడికి వెళ్లినా ‘తారక్‌ ఎంత బాగా చేశాడో’ అని చెబుతున్నారు. నేను ‘బిగ్‌బాస్’‌ చూడలేదు. ఇప్పుడు చూడాలని డౌన్‌లోడ్‌ చేశా. ఒక సీజన్‌‌ బాగా చేసినప్పుడు.. రెండోసారి కూడా వంద శాతం అలాగే చేయడం కాస్త కష్టం. కానీ, ప్రయత్నిస్తాం. షో కోసం జరుగుతున్న ఏర్పాట్లు చూస్తుంటే.. మీరు ఈసారి కూడా దీన్ని ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం కుదిరింది. నా వంతుగా చక్కగా చేయడానికి ప్రయత్నిస్తా’’

* ఈ ఆఫర్‌ రాగానే మీ రియాక్షన్‌ ఏంటి?
‘‘నన్నే ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారు అనిపించింది. ఎందుకంటే ‘బిగ్‌బాస్‌’ షోను నేనెప్పుడూ చూడలేదు. నాకు మొదటి కాల్‌ అల్లు అరవింద్‌ గారి నుంచి వచ్చింది. చాలా నమ్మకంగా.. నువ్వే చేయాలి, చేయగలవు అన్నారు. ఆయన అలా చెప్పేసరికి వెళ్లి సగం ఎపిసోడ్‌ చూశా. ఎక్కడికి వెళ్లినా ఈ షో గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో.. ప్రేక్షకులకు, నాకు మధ్య బంధాన్ని ఇది ఇంకా పెంచుతుంది అనిపించింది. అదే ప్రధాన కారణం’’

* ఎన్టీఆర్‌ను కలిశారా, చర్చించుకున్నారా?
‘‘మహానటి’ వేడుకలో తారక్‌ను కలిశా. ఆ తర్వాత సరదాగా ఆయన ఇంటికి వెళ్లా. సినిమాలు చేస్తున్న మాకు ఈ షో కొత్త కోణం కాబట్టి.. స్టేజ్‌ మీద మనం మనలా ఉంటే చాలు అనుకున్నాం. తారక్‌కు ప్రామిస్‌ చేశా.. తన ఎపిసోడ్‌లు అన్ని చూస్తానని’’

* సల్మాన్‌, ఎన్టీఆర్‌ బెంచ్‌మార్క్‌ క్రియేట్‌ చేశారు. మీరు ఎవర్ని ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు?
‘‘నేను ఎవర్నీ ఫాలో అవ్వను. నాకు నచ్చినట్లు చేసుకుంటూ పోతాను’’

* ‘బిగ్‌బాస్‌’ సీజన్‌లో ఇప్పటి వరకూ టాప్‌ స్టార్స్‌ చేశారు. సల్మాన్‌, ఎన్టీఆర్‌, కమల్‌.. ఇప్పుడు ‘నేచురల్‌ స్టార్‌’ ఆ హోదాను ఎంజాయ్‌ చేస్తున్నారా?
‘‘నేను దీన్ని హోదా‌లా చూడటం లేదు. బాధ్యతగా నమ్ముతున్నా. మొదటి నుంచి నేను చేస్తున్న ఏ సినిమా అయినా కుటుంబం అంతా కలిసి చూడాలి అన్నదే నా సూత్రం. ఈ రోజు దీన్ని కూడా అంతకు మించి బాధ్యతగా ఫీల్‌ అవుతున్నా’’

* నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్‌ ఈ మధ్య హోస్ట్‌లు చేశారు.. మీకు తొందరగా అవకాశం వచ్చిందా?
‘‘ఇప్పుడు ఎవరూ సినిమాను వేరుగా, టీవీను వేరుగా చూడటం లేదు. ఆ అడ్డుగీతలు చెరిగిపోయాయి. చిరంజీవి గారు, నాగార్జున గారు చేసినప్పుడు మాలాంటి వాళ్లకున్న చిన్న చిన్న భయాలు తొలగిపోతాయి. మనం కూడా చేయొచ్చు అనిపిస్తుంది’’

* ‘బిగ్‌బాస్’లో‌ నాని ఎలా ఉంటారు?
‘‘నేను ఇంకా షో మొదలు పెట్టలేదు. షో గురించి పూర్తిగా తెలియదు. త్వరలో నాకు షో గురించి వివరించబోతున్నారు’’

* మీరు షో వ్యాఖ్యాతగా ఉండబోతున్నారు కదా? చిత్ర పరిశ్రమలోని మీ స్నేహితులు ఎవరైనా తమని షోకు రికమెండ్‌ చేయమని అడిగారా?
‘‘అడగలేదు. ఎందుకంటే నేను రికమెండ్‌ చేయనని వాళ్లకు తెలుసు. నన్నొచ్చి అడిగితే.. వాడిని పెట్టొద్దు అని చెబుతానని రాలేదు. కానీ, ఈ షోకున్న క్రేజ్‌ చూసి.. ఇంత పాపులర్‌ అయ్యిందా అని షాక్‌ అయ్యా’’

* సినిమా ఒత్తిడి తీసుకోవడం సులభమా?, టీవీ హోస్ట్‌గా ఉండటం సులభమా?
‘‘సినిమా ఒత్తిడి అంతసులభం కాదు. నాకది బాగా తెలుసు. హోస్ట్‌ బాధ్యతల్లోకి ఇంకా దిగలేదు. చేయగలను అన్న నమ్మకం ఉంది. ఇంట్లో మా వాళ్లు ‘బిగ్‌బాస్’‌ చూస్తుంటే ‘మీకు పనిపాట లేదా? ఇలాంటి షోలు చూస్తుంటారు’ అని తిట్టేవాడ్ని. కానీ, ఇప్పుడు దేవుడు నన్ను తీసుకొచ్చి, అక్కడే కూర్చోబెట్టాడు’’

* ఇంతకు ముందు షో షూట్ ముంబయిలో జరిగింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే చక్కగా సెట్‌ వేశారు. సంతోషంగా ఫీల్‌ అవుతున్నారా?
‘‘మూడు సినిమాలు చేస్తున్నా కదండీ.. ముంబయి వరకూ వెళ్లడం కష్టం. అక్కడ సెట్‌ ఉండటం వల్ల తారక్ శుక్రవారం సాయంత్రం వెళ్లి ఆదివారం మధ్యాహ్నం తిరిగొచ్చేవారు. ఇంటిలో వారిని మిస్‌ అయ్యేవారు. కానీ, ఇప్పుడు నేను చక్కగా శనివారం సాయంత్రం వెళ్లి మా జున్నుగాడితో (నాని కుమారుడు అర్జున్‌ ముద్దుపేరు) ఆడుకోవచ్చు. ఎక్కువ మిస్‌ కాను. అది కాస్త సౌకర్యంగా తయారైంది. టీం మొత్తం ఇక్కడి వారే కాబట్టి.. నేటివిటీగా దగ్గరగా ఉంటుంది’’

* సహజంగా నటిస్తారని మీకు ‘నేచురల్‌ స్టార్‌’గా పేరొచ్చింది. ఇప్పుడు ఈ షో కోసం నటించకుండా ఉండటానికి మీరు ఏం చేయబోతున్నారు?
‘‘నేచురల్‌గా నటించడం వేరు. మనం మనలా ఉండటం వేరు. నేను నాలా ఉండటం చాలా సులభం. దాన్ని మీరు ఎంజాయ్‌ చేస్తారా? లేదా? అనేది ఇక్కడ ముఖ్యం’.

* ‘బిగ్‌బాస్‌’ను ఒప్పుకోవడానికి ముఖ్యమైన కారణం?
‘‘ఇలాంటి షోను నేను చేయగలనా? అని ఓ ఛాలెంజ్‌లా అనిపించింది. ఎక్కడికి వెళ్లినా దీని గురించి మాట్లాడుతుంటే.. ‘ఈ షోకు అంత రీచ్‌ ఉందా, మూడున్నర నెలలు ప్రేక్షకుల ఇంట్లో ఉందాం’ అనిపించింది’’

* చాలా మంది హోస్ట్‌గా చేశారు. మీకు ఇష్టమైన వారు ఎవరు?
‘‘అమితాబ్‌ బచ్చన్‌. హోస్టింగ్‌ విషయంలో ఆయన్ను ఎవరూ బీట్‌ చేయలేరు. ఆయన కూర్చుని మాట్లాడితే చాలు’’

* ఇప్పుడు నాగార్జునతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్‌ విరామంలో ‘బిగ్‌బాస్‌’ కోసం సూచనలు‌ తీసుకుంటున్నారా?
‘‘నాగార్జునకు షోల పట్ల, వాటి నిర్వాహణ పట్ల అవగాహన ఉంది. ‘బిగ్‌బాస్‌’ టీంలో ఎవరెవరు ఉన్నారు అని అడిగారు, చెప్పాను. అయితే బాగా వస్తుందని అన్నారు’’

* మీ జీవితంలో ‘బిగ్‌బాస్’‌ ఎవరు?
‘‘ఏమంటానని మీరు ఊహిస్తున్నారు.. మా ఆవిడ అంటాను అనుకున్నారా? (నవ్వుతూ).. నా జీవితంలో ఎప్పుడూ ప్రేక్షకులే అండి. వాళ్లే మొత్తం నిర్ణయిస్తారు’’

* ‘ఇంకొంచెం మసాలా’ అంటున్నారు. మీరు షోకు ఏం యాడ్‌‌ చేయాలి అనుకుంటున్నారు.
‘70 రోజుల షో ఇప్పుడు 100 రోజులు అయ్యింది. మొత్తం ఆసక్తికరంగా ఉండేలా చూస్తున్నాం. అంతా ఇప్పుడే చెప్పేస్తే ఎలా..’.

* మీ ఇంట్లో వాళ్లు షో చూస్తుంటే.. ఎందుకు చూస్తున్నారని తిట్టారు. మీకు ఛాన్స్‌ ఇస్తే అలా ఓ హౌస్‌లో అన్ని రోజులు ఉంటారా?
‘‘నేను ఉండను. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా కోసం 42 రోజులు హిమాలయాల్లో ఉన్నాను. అప్పుడే నాకు ఆత్మ పరిశోధన జరిగిపోయింది. జరగాల్సిన వారు హౌస్‌లోకి వెళ్లాలి. మీకు ఈ షో పూర్తిగా వినోదాన్ని ఇస్తుంది. ఇంట్లో వారికి, ఫోన్‌కు, నిత్య జీవితంలో అలవాటు పడ్డ వాటికి దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలిసింది. హిమాలయాలకు వెళ్లినప్పుడు నా ఆలోచనలు మారిపోయాయి. నాలోపల నుంచి ఉత్తమ వ్యక్తి బయటికి వచ్చాడు’’

* ఈ షో ద్వారా మీ ఇమేజ్‌ ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారా? అది మీ కెరీర్‌కు ఎంత వరకు బలం కాబోతోంది?
‘‘ప్రతిఫలం చూసి నేనెప్పుడూ సినిమా చేయలేదు, షోను కూడా చేయను. నమ్మి, వంద శాతం చేయాల్సింది చేశామా? అన్నదే ముఖ్యం’’

* మీకున్న పక్కింటి కుర్రాడి ఇమేజ్‌ ఈ షో ద్వారా మరింత బలపడుతుందని నమ్ముతారా?
‘‘పదేళ్ల నుంచి పక్కింటి కుర్రాడు అంటున్నారు.. ఇప్పుడు ప్రమోషన్‌ వచ్చింది. పక్కింటి నుంచి మీ ఇంట్లోకి వస్తాను’’

* తారక్‌ ‘బిగ్‌బాస్’‌ షోలో చికెన్‌ చేసి అందరికీ పెట్టారు? మీరు దేనికి సిద్ధం అవుతున్నారు?
‘నాకు ఆమ్లెట్‌‌ వేయడం కూడా రాదు. కావాలంటే తారక్‌ను పిలిపించి, మరోసారి చికెన్‌ చేసి పెడదాం. నాకు వంటలు రావు. కావాలంటే ఆ స్థానంలో మరో టాలెంట్‌ను ఉంచుదాం’’

* ఈ షోను ఒప్పుకోవడంలో పారితోషికం పాత్ర ఎంత?
‘‘సినిమాను ఒప్పుకోవడంలో పారితోషికం పాత్ర ఎంతో.. ఇందులోనూ అంతే. కొత్త విషయం ఉండదు. ఇస్తాను అన్నది వద్దనను.. అలాగని కాదన్నది తీసుకోను’’

* ఈ సీజన్‌ కోసం మీ సినిమాల్ని రీ షెడ్యూల్‌ చేసుకున్నారా?
‘‘లేదు.. ఇప్పుడు నాగార్జునతో చేసే సినిమా మొత్తం హైదరాబాద్‌లోనే ఉంటుంది’’

* ‘బిగ్‌బాస్ ‌1’లో ఉన్న వారు ‘బిగ్‌బాస్ ‌2’లో మళ్లీ ఉంటారా?
‘‘లేదు.. ఉండరు’’

‘‘బిగ్‌బాస్‌ 2’ షో నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డేట్స్‌ కుదరకపోవడం వల్ల ఎన్టీఆర్‌ దీని నుంచి తప్పుకొన్నారని చెప్పారు. ఈ సీజన్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని అన్నారు. ఇది సహజంగా జరిగే షో అని పేర్కొన్నారు.

 

Leave a Comment