Nandamuri HariKrishna Died in Road Accident at Anneparthy

నల్గొండ:ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెెందారు. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు ఎపి28బిడబ్ల్యు 2323 కారులో మరో ఇద్దరితో కలసి బయలుదేరిన హరికృష్ణ ప్రమాద సమయంలో తానే స్వయంగా నడుపుతున్నట్లు తెలిసింది.
తెల్లవారుఝామున 4.30కి బయలుదేరిన కారు నార్కెట్ పల్లి-అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా అన్నేపర్తికి చేరుకోగానే ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ప్రమాద సమయంలో కారు వేగంతో ప్రయాణిస్తోందని తెలిసింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ తలకు,ఛాతీ భాగానికి బలమైన గాయాలు అయినట్లు తెలిసింది. దీంతో శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో హరి కృష్ణ కారు బోల్తా పడింది..

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. ఇదే రహదారిపై గతంలో హరికృష్ణ కుమారుడు ప్రమాదానికి గురై చనిపోయారు. ప్రమాదం విషయం తెలియగానే హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆస్పత్రికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు, నారా లోకేష్ కూడా హైదరాబాదుకు బయలుదేరారు. హరికృష్ణకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.

అయితే, ప్రమాద స్థలంలో రెండు వాహనాలు ఉండడంతో హరికృష్ణ రోడ్డుపై పడిపోవడంతో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ఆ వాహనాన్ని ఢీ కొట్టి పల్టీ కొట్టిందా..? వేరే వాహనం రాంగ్‌రూట్‌లో వచ్చి ఎదురుగా ఢీకొట్టిందా..?…అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు,అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Leave a Comment