Asia cup 2018 India vs Pakistan cricket match

 క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆసియాకప్‌లో భాగంగా భారత్‌ చిరకాల ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది జూన్‌లో ఛాంఫియన్స్‌‌ ట్రోపీలో భాగంగా ఈ రెండు జట్లు తలపడినప్పుడు పాక్‌నే విజయం వరించింది. అయితే, ఈసారి ఎలాగైనా దాయాది జట్టును ఓడించి ముందుకు వెళ్లాలనే కసితో టీమిండియా సన్నద్ధమవుతోంది. టోర్నీ ఏదయినా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఉందంటే యావత్‌ ప్రపంచం దృష్టంతా అటువైపే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే, ఈ మ్యాచ్‌ జరగనున్న దుబాయ్‌ స్టేడియంలో టికెట్లన్నీ కొద్ది రోజుల ముందే అమ్ముడుపోయాయి. అంతేకాదు.. మ్యాచ్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు కూడా టికెట్ల రేట్లను అమాంతం పెంచేశారు. ఒక్కో టికెట్‌ ధర అత్యల్పంగా రూ.9వేలు, అత్యధికంగా ఒక్కో లగ్జరీ సీటు టికెట్‌ రూ.లక్ష వరకూ పలికిందని అక్కడి మీడియా తెలిపింది. మామూలు మ్యాచ్‌లకు రూ.3వేలు ఉన్న టికెట్‌ ధరను.. ఈ మ్యాచ్‌కున్న క్రేజ్‌ దృష్ట్యా మూడు రెట్లు పెంచి రూ.9వేలు చేశారు.

ఈ మ్యాచ్‌ను పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు సమాచారం. సౌదీ అరేబియా, యూఏఈ పర్యటన కోసం ఇమ్రాన్‌ ఇప్పటికే స్వదేశాన్ని వీడారు. ఇమ్రాన్‌ మ్యాచ్‌కు హాజరవడంపై అధికారిక సమాచారం లేనప్పటికీ.. పాక్‌ మీడియా మాత్రం ఆయన స్టేడియానికి వస్తారని పేర్కొంది. ఇమ్రాన్‌ పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌ అన్న సంగతి తెలిసిందే.

Leave a Comment