తెలంగాణ అసెంబ్లీ రద్దు అప్‌డేట్స్‌

హైదరాబాద్‌: ముందుస్తు ఎన్నికల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునున్నారు. అసెంబ్లీ రద్దుపై వ్యూహాలు అవలంభించాలన్న దానిపై ప్రతిపక్షాలు చర్చోపచర్చలు జరుపుతున్నాయి. బీజేపీ నేతలు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేశారు. . ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని కోదండరాం అన్నారు. తెలంగాణ శాసనసభ రద్దుకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు మీ కోసం..

మధ్యాహ్నం 3 గంటలు:ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం సీఎం కేసీఆర్‌ మళ్లీ గజ్వెల్‌ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. చెన్నూరు, ఆందోల్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించారు. వారికి ముందే సమాచారం ఇచ్చామని, వారికి తగినవిధంగా గౌరవించుకుంటామని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఇక 14స్థానాల్లో అభ్యర్థుల పేర్లు పెండింగ్‌లో ఉంచారు

మధ్యాహ్నం 2.50 గంటలు: ప్రారంభమైన కేసీఆర్‌ మీడియా సమావేశం..

  • అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది: సీఎం కేసీఆర్‌
  • రాష్ట్రం బాధ్యతయుతంగా ముందుకుసాగాలనే ఆలోచనతోనే గత ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాం
  • గత ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో స్పష్టమైన మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్నారు

మధ్యాహ్నం 2: 35 : ప్రగతి భవన్‌ నుంచి తెలంగాణ భవన్‌ బయలుదేరిన కేసీఆర్‌

మధ్యాహ్నం 1: 45 :అసెంబ్లీ రద్దుపై కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ నరసింహన్‌కు కేసీఆర్‌ అందించారు. కేబినెట్‌ తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రక్రియ పూర్తయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్‌ కోరారు.

మధ్యాహ్నం 1.30: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు సీఎం కేసీఆర్‌, మంత్రులు కలిశారు. అసెంబ్లీ రద్దు గురించి గవర్నర్‌కు నివేదించారు.

మధ్యాహ్నం 1.06: ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు.

మధ్యాహ్నం ఒంటి గంట: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రి మండలి నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

మధ్యాహ్నం 12.50: ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని చెప్పారు.

మధ్యాహ్నం 12.35: కాసేపట్లో  రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మంత్రులు ప్రగతి భవన్‌కు తరలివస్తున్నారు. కేబినెట్‌ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మధ్యాహ్నం 12.00: తెలంగాణ అసెంబ్లీ రద్దు, ముందుస్తు ఎన్నికలపై చర్చ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి హాజరయ్యారు.

ఉదయం 11.30: కేసీఆర్‌ వ్యవహార శైలికి నిరసనగా కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఉదయం 10.57: బీజేపీ నాయకులు గవర్నర్ నరసింహన్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. శాసనసభ రద్దైతే రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నాయకులు కోరనున్నారని సమాచారం.

ఉదయం 10.50: స్పీకర్ మధుసూదనాచారితో అసెంబ్లీ కార్యదర్శి పత్ర్యేకంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ రద్దైతే తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

ఉదయం 10.45: మంత్రులందరూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్‌లో ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు ప్రగతి భవన్‌కు చేరుకుంటున్నారు.

అంతకుముందు సమాచారం…
గురువారం ఉదయం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మంత్రులకు సూచించారు. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు ఉంటుంది? ఎజెండా ఏమిటన్న విషయాలు మాత్రం గోప్యంగానే ఉంచారని ఓ సీనియర్‌ మంత్రి బుధవారం రాత్రి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. జీఏడీ అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. 1–30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి కేబినెట్‌ తీర్మానం కాపీని అందజేస్తారు. అనంతరం గన్‌పార్క్‌ వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం రెండు గంటలకు కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ భవన్‌కు చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడతారు. శాసనసభ రద్దుకు సంబంధించి గురువారం సాయంత్రం ప్రకటన వెలువడగానే.. శుక్రవారం ఉదయం సిద్దిపేట జిల్లాకు బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తరువాత హుస్నాబాద్‌కు చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

నేటి సాయంత్రం నుంచి ఆపధర్మ ప్రభుత్వం
శాసనసభ రద్దుకు సంబంధించి గవర్నర్‌ నరసింహన్‌ సాయంత్రం నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని, అదేసమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని కేసీఆర్‌ను కోరతారని అధికార వర్గాలు వెల్లడించాయి. శాసనసభ రద్దయిన వెంటనే 119 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం కోల్పోతారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు యధావిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వారి జీతభత్యాలు, అలవెన్సుల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా ఆపధర్మ మంత్రిమండలిగా కొనసాగాలని గవర్నర్‌ తన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆపధర్మ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు.

Leave a Comment