Telangana Panchayat Secretary 2018 recruitment begins Sep 3

జవాబు తప్పయితే పావు మార్కు కోత
కొత్త జోన్లలో తొలి నోటిఫికేషన్‌..
3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ఎస్సీలకు 15 %, ఎస్టీలకు 6 % రిజర్వేషన్‌..
ప్రతి కోటాలో మూడోవంతు స్ర్తీలకే
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 9,355 పోస్టులకు పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేస్తారు. కొత్త జోనల్‌ విధానం జీఓ 124 ప్రకారం ఇది జిల్లాస్థాయి పోస్టు. ప్రతి జిల్లాలోనూ 95 శాతం పోస్టులు స్థానికులకే. మిగిలినవి ఓపెన్‌ కోటాలో ఉంటాయి. ఈ పోస్టుల భర్తీకి గురువారమే నోటిఫికేషన్‌ జారీ చేయగా పూర్తి సమాచారాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు.

దివ్యాంగులకు 3 శాతం, క్రీడా కోటాకు 2 శాతం పోస్టులు కేటాయించారు. ఇది సమాంతర రిజర్వేషన్‌. ప్రతి కోటాలో మూడో వంతు పోస్టులను మహిళలకు కేటాయిస్తారు. కార్యదర్శుల పోస్టులకు కనీస విద్యార్హత డిగ్రీ. 31-08-2018 నాటికి గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయాల నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ నెల 3 నుంచి 12 వరకు ‘ఆన్‌లైన్‌’ ద్వారానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు చెల్లించేందుకు చివరి గడువు సెప్టెంబరు 11. నిరుద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా పరీక్షకు అర్హులు. అయితే, వారు పనిచేస్తున్న శాఖ/కార్యాలయం నుంచి ‘నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌’ను దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు సర్వీసు నుంచి వైదొలగినప్పటి నుంచి మూడేళ్ల వరకు, వికలాంగులకు పదేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (ఆర్టీసీ, కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు మినహా) అయిదేళ్లు సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు ‘‘టీఎస్‌పీఆర్‌ఐ.సీజీజీ.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌ సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. సాంకేతిక సమస్యలు ఎదురైతే 9346180688 నంబరులో సంప్రదించాలి. జనరల్‌, క్రీమీలేయర్‌ పరిధిలోకి వచ్చే బీసీలకు రూ.800 ఫీజుగా నిర్ణయించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వికలాంగులు, మాజీ సైనికోద్యోగులు రూ.400 చెల్లించాలి. ఆన్‌లైన్‌ ద్వారానే ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. డీడీ/ఐపీఓలు చెల్లవని స్పష్టం చేశారు.

రెండు పరీక్షలు … 200 మార్కులు

మొత్తం రెండు ప్రశ్న పత్రాలతో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషలలో పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 (పావు) మార్కు కోత విధిస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత పడుతుంది. ఇదీ పరీక్ష విధానం.

పేపర్ -1: ప్రశ్నలు-100. సమయం-120 నిమిషాలు. మార్కులు-100 (జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ, కల్చర్‌ అండ్‌ హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ)

పేపర్-2: ప్రశ్నలు-100, సమయం-120 నిమిషాలు, మార్కులు-100 (తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు)

రాత పరీక్షల్లో మెరిట్‌ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఉద్యోగపర్వమిలా…

నెలవారీ భృతి రూ.15,000తో మూడేళ్ల పాటు పనిచేయాలి.

పనితీరు (ప్రతిభ) ఆధారంగా ప్రతి సంవత్సరం వార్షిక పెంపుదల ఉంటుంది. మూడేళ్ల తదుపరి గ్రేడ్‌-4 కార్యదర్శిగా నియమిస్తారు.

తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018 నిబంధనల ప్రకారం పనితీరును పరిగణిస్తారు.

కొన్ని మార్పులు, విశేషాలు

పంచాయతీ కార్యదర్శుల నియామకానికి 150 మార్కులతో రెండు ప్రశ్న పత్రాలను మొత్తం 300 మార్కులకు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. తుది మార్గదర్శకాల్లో మాత్రం 100 మార్కుల వంతున రెండు పరీక్షలు కలిపి 200 మార్కులుగా పేర్కొన్నారు. దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావించినప్పటికీ, ఇప్పటి వరకు అమలులో ఉన్న 3 శాతాన్నే ఖరారు చేశారు. తొలుత నిర్ణయించిన దానికంటే కొంత సిలబస్‌ను చేర్చారు. దరఖాస్తు గడువు చివరి తేదీ 11 తేదీగా తొలుత నిర్ణయించినా, దానిని 12వ తేదీకి మార్చారు. కొత్త జోనల్‌ విధానం అమలులోకి వచ్చిన తదుపరి జారీ చేసిన తొలి నోటిఫికేషన్‌ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులదే కావడం గమనార్హం.

 

పోస్టుల ఖాళీలు జిల్లాల వారీగా..

ఆదిలాబాద్‌- 335, భద్రాద్రి-కొత్తగూడెం – 387, జగిత్యాల- 288, జనగామ- 206, జయశంకర్‌-భూపాలపల్లి – 304, జోగుళాంబ-గద్వాల- 161, కామారెడ్డి- 436, కరీంనగర్‌- 229, ఖమ్మం- 485, కుమ్రంభీం-అసిఫాబాద్‌- 235, మహబూబాబాద్‌- 370, మహబూబ్‌నగర్‌- 511, మంచిర్యాల- 232, మెదక్‌- 346, మేడ్చల్‌-మల్కాజిగిరి- 27, నాగర్‌కర్నూల్‌- 311, నల్లగొండ- 611, నిర్మల్‌- 322, నిజామాబాద్‌- 405, పెద్దపల్లి- 194, రాజన్న-సిరిసిల్ల- 177, రంగారెడ్డి- 357, సంగారెడ్డి- 446, సిద్దిపేట- 338, సూర్యాపేట- 342, వికారాబాద్‌- 429, వనపర్తి- 159, వరంగల్‌ రూరల్‌- 276, వరంగల్‌ అర్బన్‌- 79, యాదాద్రి-భువనగిరి- 307.

Leave a Comment