మా ప్రేమ అలా మొదలైంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: రాగం.. తానం.. పల్లవిలాంటి మూడు ముళ్లు వేసి.. సప్త స్వరాలతో ఏడడుగులు వేసి.. సంగీత ప్రయాణాన్ని సంసార ప్రయాణంగా.. సంసార ప్రయాణాన్ని సప్త స్వరాల సమ్మేళనంగా చేసుకుని సాగిపోతున్న జంట మల్లికార్జున్‌, గోపికా పూర్ణిమ. అలీ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’కు విచ్చేసిన వారు ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.

పాటలు పాడుతున్నారు.. డ్యాన్స్‌ చేస్తున్నారు. స్టెప్‌లు ఇక్కడే వేస్తున్నారా? ఇంట్లో కూడా వేస్తారా?
మల్లికార్జున్‌: ఇంట్లో వేయను. మనకు ఇక్కడే స్టెప్స్‌ వేసే ధైర్యం వస్తుంది. ఇంట్లో చిందులు వేసే సమయం ఇప్పటివరకూ రాలేదు. ఎందుకంటే ఆవిడ డ్యాన్స్‌ ఆడిస్తుంటుంది అదే వేరే విషయం(నవ్వులు)

మల్లి.. ఇంట్లో మిమ్మల్ని ఏ పేరుతో పిలుస్తాడు?
గోపిక పూర్ణిమ: మరీ దూరం ఉంటే ఫోన్‌ చేస్తాడు. దగ్గరగా ఉంటే చేత్తో ‘ఇలా రా’ అంటాడు. కనీసం మా అమ్మానాన్నలు పెట్టిన పేరు పెట్టి కూడా పిలవడు. బయటకు వెళ్తే విజిల్‌ వేసి పిలుస్తాడు.. అలా పిలవద్దని వార్నింగ్‌ కూడా ఇచ్చా.

మీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు?
మల్లికార్జున్‌: ఇదే సారథి స్టూడియోలో, ఇదే ఫ్లోర్‌లో 1996 జూన్‌ 30న పాడుతా తీయగా కార్యక్రమంలో కలుసుకున్నాం. అప్పుడు నేను డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నా. తను 9వ తరగతి ఎగ్జామ్స్‌రాసి ఫస్ట్‌ ఎపిసోడ్‌లో పాడటానికి వచ్చింది. ‘ఏయ్‌ అమ్మాయి. పరీక్షలు ఎలా రాశావ్‌. పర్సంటేజ్‌ ఎంత వస్తుంది’ ఇది నేను అడిగిన మొదటి ప్రశ్న. అప్పట్లో కేవలం స్టూడెంట్‌లాగానే ట్రీట్‌ చేశా. ఆ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియదు. ఆ ప్రేమ పెళ్లిగా మారి ఇప్పుడు మాకొక పాప పుట్టి ఈ ప్రయాణం స్నేహబంధంలా కొనసాగుతోంది.

ఎవరు ముందు అప్రోచ్‌ అయ్యారు?
మల్లికార్జున్‌: నేనే. మా మధ్య స్నేహం సాగుతున్న వేళ వందేమాతరం శ్రీనివాస్‌గారు మాకు ఒకే సినిమాలో ఒకే పాటతో పాడే అవకాశం ఇచ్చారు.
గోపిక పూర్ణిమ: ఆర్‌.నారాయణ మూర్తిగారి ‘సింగన్న’లో శ్రీనివాస్‌గారితో మేమిద్దరం కలిసి పాడాం.
మల్లికార్జున్‌: దాదాపు పదేళ్ల తర్వాత గోపికకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ‘గోపికకు అమెరికా సంబంధం కూడా వచ్చింది. ఏదైనా ఉంటే మీరూ సిఫార్సు చేయండి’ అని బాలూగారు కూడా చెప్పారు. ఇలా జరుగుతున్న సందర్భంలో నాలో ఏదో తెలియని వెలితి వచ్చేసింది. అప్పట్లో మొబైల్‌ ఫోన్లు లేవు. కాయిన్‌బాక్స్‌ నుంచి ఆమెకు కాల్‌ చేసి, ‘నీతో ఒక విషయం చెప్పాలి. ఐ లవ్‌ వ్యూ’ అని చెప్పేశా. అవతలి నుంచి ‘ఇంకా ఏంటి సంగతులు’.. అంటూ కొనసాగింపు ప్రశ్న. 
గోపిక పూర్ణిమ‌: తను ఫోన్‌లో చెప్పిందే చివరిది. మళ్లీ ఎప్పుడూ ‘నేను చెప్పింది ఏం చేశావ్‌’, ‘ఆలోచించావా’ అని అడగలేదు. నేనూ ఆ విషయం ఎత్తలేదు. మా ఇంట్లో సంబంధాలు చూడటం ఎక్కువైన దగ్గరి నుంచీ తనకి కలిగిన ఫీలింగే నాకూ కలిగింది. దాంతో ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని నేను అడిగా.

మల్లీ నీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట ఏది?
మల్లికార్జున్‌: ‘పాడుతా తీయగా’లో బాగా పాడిన వాళ్ల నెంబర్లు తీసుకుని ఆర్పీగారు అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. అలా ‘చిత్రం’లో ‘ఏకాంత వేళ..’ పాట పాడే అవకాశం ఇచ్చారు. మళ్లీ ‘ఆనందం’లో ‘కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల’ పాట పాడా. ఈ పాట పాడిన తర్వాత అందరూ నా గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. అలా నేను మణిశర్మగారి దృష్టిలో పడ్డా. ఆయన ‘సుబ్బు’, ‘ఆది’లో పాడే అవకాశం ఇచ్చారు. ‘నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి..’ పాట నాకు మంచి బ్రేక్‌ తీసుకొచ్చింది. నాకు ఊహ తెలిసిన నాటి నుంచి ఇద్దరు వ్యక్తులంటే బాగా ఇష్టం. ఒకరు బాలుగారు. ఇంకొకరు చిరంజీవి గారు. ‘ఇంద్ర’ సినిమాలో బాలుగారితో కలిసి ‘ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా’ పాటలో చిరంజీవి నటించారు.

ఇప్పటివరకూ ఎన్ని పాటలు పాడారు?
మల్లికార్జున్‌: పాడిన పాటలు తక్కువేకానీ, ప్రతి హీరోకు కచ్చితంగా ఒక పాట పాడా. బాలుగారు, మనోగారి తర్వాత అందరు హీరోలకు కనీసం ఒక్క పాట పాడిన వాళ్లలో నేను ఒకడిని. మణిశర్మగారు నాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు.

మల్లి మీద మీరు ఒక కంప్లైయింట్‌ ఇచ్చారట!
గోపిక పూర్ణిమ‌: కంప్లయింట్‌ అని కాదు.. పెళ్లయిన తర్వాత ఇప్పటి వరకూ నాకు ఒక్కసారి కూడా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వలేదు. ఒకసారి అడగ్గా.. అడగ్గా.. రింగ్‌ మాత్రం ఇచ్చారు.

మీకు బాగా పేరు తీసుకొచ్చిన సాంగ్‌ ఏది?
పూర్ణిమ: ‘బొమ్మను గీస్తే..’ పాటకు మంచి పేరు వచ్చింది. ఇప్పటివరకూ దాదాపు 500 పాటలు పాడా. ప్రైవేటు ఆల్బమ్‌లకు 4వేలకు పైగా పాటలు పాడా.

మీరు మల్లికి ఏదైనా సర్‌ప్రైజ్‌ ఇచ్చారా?
పూర్ణిమ: మొదటి పెళ్లి రోజుకు ఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చా. నేను ఏదైనా సర్‌ప్రైజ్‌ ఇచ్చినా పెద్దగా సర్‌ప్రైజ్‌ కాడు. అలాగే తను మారిపోలేదు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు.

మీరు ప్రేమలో ఉండగా బాలూగారు మీకేదో వార్నింగ్‌ ఇచ్చారట!
పూర్ణిమ: మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకొన్న తర్వాత బాలూగారు ఫోన్‌ చేసి చెప్పిందేంటంటే.. ‘మామూలుగా నాకు ఒళ్లంతా కళ్లు.. నాకు కొంచెం తేడా అనిపించినా పసిగట్టేస్తాను. నేను వీళ్లను చాలా టూర్లు తీసుకెళ్లాను. ఎక్కడా నా కంట పడలేదు వీళ్లు. చాలా సభ్యతగా వ్యవహరించారు’ అని కాంప్లిమెంట్‌ ఇచ్చారు. మా నాన్నగారు వాళ్లు చాలా సంతోష పడ్డారు.

ఇంట్లో మీరు గొడప పడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?
పూర్ణిమ: సాధారణంగా మా ఇంట్లో అందరం తెల్లవారుజామున 3గంటలకు నిద్రలేస్తాం. కానీ, పెళ్లయిన తర్వాత మల్లితో గొడవ పడిన సందర్భం ఏదైనా ఉందంటే.. నిద్ర లేవకపోవడం విషయంలోనే. ఈయనగారు ఉదయం 8గం.టలకు నిద్రలేచేవారు. రాత్రి 1గంట వరకూ పడుకోరు. పెళ్లయిన మొదటి ఐదేళ్లు ఇబ్బంది పడ్డాను.
మల్లికార్జున్‌: ఇప్పుడు ఆ పరిస్థితి లేదులెండీ! ఉదయం 5గంటలకే నిద్ర లేస్తా. ఎందుకంటే పాపను స్కూల్‌కు రెడీ చేయాలి. (మధ్యలో పూర్ణిమ అందుకుని మీరు రెడీ చేస్తారా!!)

మీకు స్ఫూర్తినిచ్చిన గాయని‌ ఎవరు?
పూర్ణిమ: నాకు శైలజగారు స్ఫూర్తి. ఆమె యాటిట్యూడ్‌, జీవన విధానం నచ్చుతాయి. జీవితంలో మనం ఎలా ఉండాలో ఆమె నుంచి నేర్చుకోవచ్చు. మన జీవితంలో ఎన్ని అవార్డులు, ప్రశంసలు వచ్చాయన్నదాని కన్నా మనం ఎంత ఆనందంగా జీవిస్తున్నామన్నదే ముఖ్యం.

మీ నాన్నగారు డబ్బులిస్తే అస్సలు ఖర్చుపెట్టేవారు కాదట!
మల్లికార్జున్‌: ఖర్చు పెట్టేస్తే, మళ్లీ నాన్నగారు ఇవ్వాల్సి వస్తుందని అస్సలు ఖర్చు చేసేవాడిని కాదు. 
పూర్ణిమ: అలా ఖర్చు పెట్టకుండా చిన్నప్పుడు వచ్చిన అలవాటు అలా కొనసాగింది. చెన్నై వెళ్లినప్పుడు శరవణభవన్‌ వెళ్లి టీ తాగాలన్నా పర్సు తీసేవాడు కాదు. నా దగ్గరే కాదు.. ఎవరి దగ్గరా తీసేవాడు కాదు. పెళ్లయిన తర్వాత నేను పర్సు తీసుకెళ్లడం మానేశా. కానీ, గర్వించదగ్గ విషయం ఏంటంటే.. మీ అందరూ ఎలా అయితే, కష్టపడి పైకి వచ్చారో దాదాపు మల్లి కూడా అలాగే పైకి వచ్చాడు. కెరీర్‌ తొలినాళ్లలో కేవలం ఒక చాప రెండు జతల బట్టలు, ఒక సూట్‌కేస్‌తో సినీ పరిశ్రమలోకి వచ్చాడు. ఇప్పటికీ ఆ సూట్‌కేస్‌ను అలాగే ఉంచాం. అప్పట్లో మేము టి.నగర్‌లో ఉండేవాళ్లం. మాది అప్పటికే స్థితిమంతుల కుటుంబం. తనేమో వెస్ట్ ‌మాంబళంలో ఉండేవాడు. అక్కడినుంచి ఆటోలో వచ్చే పరిస్థితి లేదు. బస్సుకు కూడా ఎందుకు డబ్బులు వేస్ట్‌ అని, దాదాపు నాలుగు కి.మీ. పాట ప్రాక్టీసు చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చేవాడు. ఆ పరిస్థితి నుంచి ఈ స్థితికి రావడం నేను చూశా.

మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేసేవాళ్లు?
పూర్ణిమ: నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. ఎందుకంటే మేము బాగా ప్రేమించుకుని, ఆ తర్వాత ఫిక్స్‌ అయిపోయిన వాళ్లం కాదు. స్నేహంగా మొదలైన మా ప్రయాణం అలా పెళ్లివైపు వెళ్లింది. ‘పెద్దవాళ్లు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం. లేదంటే వేచి చూద్దాం!. వాళ్లు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోకూడదు’ అని మొదట్లోనే అనుకున్నాం.

మణిశర్మ దగ్గర పాటలు పాడుతున్న రోజుల్లో వేరే సింగర్‌ వస్తే అడ్డు పడేవాడివని విన్నాను, నిజమేనా?
మల్లికార్జున్‌: అది చాలా తప్పు. బాంబే సింగర్స్‌ రాజ్యమేలుతున్న రోజుల్లో వారితో పాటలు పాడించే బాధ్యత నాపై పెట్టారాయన. నా తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన కార్తీక్‌, టిప్పు, కారుణ్య, హేమచంద్ర వీళ్లంతా నన్ను సర్‌ అని పిలుస్తారు. మణిశర్మగారి దగ్గర నాకు చాలా స్వేచ్ఛ ఉండేది. నేను అందరినీ ప్రోత్సహించే వాణ్ని. నేను ఏదైనా పాట పాడితే బాగుందని మణిశర్మగారు చెప్పి నన్నే పాడమనేవారు. అలాంటి సందర్భంలోనూ వేరే సింగర్‌ పాడితే బాగుంటుందని చెప్పిన సందర్భాలెన్నో.

మేల్ ‌సింగర్స్‌‌లో బాల సుబ్రహ్మణ్యం కాకుండా ఎవరంటే ఇష్టం!
గోపిక పూర్ణిమ: మహ్మద్‌ రఫీ! చిన్నప్పటి నుంచి ఆయన పాటలు బాగా వినేదాన్ని.

Leave a Comment