బస్సులు, రైళ్లు, ట్రామ్స్.. అన్నీ ఫ్రీ

లగ్జెమ్‌బర్గ్ సిటీ: బస్సెక్కినా, రైలెక్కినా, మెట్రో రైలెక్కినా.. మన దగ్గర టికెట్ తీసుకోవాల్సిందే. కానీ ఆ దేశంలో మాత్రం ఇక నుంచి అన్నీ ఫ్రీ. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించి.. ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో లగ్జెంబర్గ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ దేశంలో అన్ని రకాల రవాణా ఉచితమే. ప్రపంచంలో ఈ నిర్ణయం తీసుకున్న తొలి దేశం లగ్జెంబర్గే కావడం విశేషం. త్వరలోనే అధికారం చేపట్టనున్న అక్కడి సంకీర్ణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే వేసవి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇప్పుడు కూడా లగ్జెంబర్గ్‌లో రవాణా చార్జీలు చాలా తక్కువే. రెండు గంటల ప్రయాణానికి రెండు డాలర్లు వసూలు చేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ టికెట్ కావాలని అనుకుంటే మూడు డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ చిన్న దేశంలో ప్రతి మూలకూ రెండు గంటల కంటే ఎక్కువ ప్రయాణం ఉండదు. ప్రజా రవాణా వ్యవస్థపై లగ్జెంబర్గ్ ఏడాదికి బిలియన్ డాలర్లు (సుమారు రూ.7 వేల కోట్లకుపైనే) ఖర్చు చేస్తున్నది. అయితే టికెట్లు తక్కువ ధరకే ఇస్తుండటం వల్ల అందులో మూడో వంతు మాత్రమే రాబడి వస్తున్నది. ఇప్పుడు వాటిని కూడా రద్దు చేశారు. లగ్జెంబర్గ్ జనాభా ఆరు లక్షలు కాగా ప్రతి రోజూ ఇక్కడ వివిధ పనుల కోసం పక్క దేశాల నుంచి రెండు లక్షల మంది వచ్చి వెళ్తుంటారు. అలాగే రాజధాని లగ్జెంబర్గ్ సిటీ జనాభా లక్షా పది వేలు కాగా.. మరో నాలుగు లక్షల మంది రోజూ వచ్చి వెళ్తుంటారు.

Leave a Comment