తెలంగాణ తీర్పు నేడే కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విజేతలెవరు? పరాజితులెవరు? రాబోయే ఐదేండ్లు రాష్ర్టాన్ని పాలించేదెవరు? ఈ నెల ఏడున ఓటరు మహాశయుడు ఈవీఎంలలో నిక్షిప్తంచేసిన తీర్పేంటి? అది సృష్టించబోయే సంచలనాలేంటి? తెలంగాణ ఆత్మగౌరవానికి, వలసాధిపత్య శక్తులకు మధ్య సాగిన ఓట్ల యుద్ధంలో గెలిచిందెవరు? మరికొద్ది గంటల్లో తేలిపోనుంది! గత మూడ్రోజులుగా తెలంగాణతోపాటు.. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు రానేవచ్చాయి! గడియారంలో ముల్లు ఉదయం ఎనిమిది గంటలను సూచించగానే రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించిన 43 కేంద్రాల్లో మొదలయ్యే ఓట్ల లెక్కింపు.. ఆ తదుపరి కొద్దిగంటలకే 1,821 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సూచన ప్రాయంగానే అయినా.. స్పష్టంగా ప్రకటించనుంది! ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియను పూర్తిచేసిన ఎన్నికల సంఘం.. కౌంటింగ్‌ను కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్లలెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు.

సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కౌంటింగ్ ప్రక్రియ వివరాలు వెల్లడించారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం 43 కేంద్రాలను ఏర్పాటుచేశామని, ఇందులో హైదరాబాద్‌లో 13 కేంద్రాలు, ఒక్కోజిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఉంటాయని వివరించారు. 14 టేబుల్స్‌ను ఒక రౌండ్‌గా గుర్తించి లెక్కింపును ప్రారంభిస్తామని, ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా 2,379 రౌండ్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభ్యర్థుల ఆధిక్యం తెలుస్తుందన్నారు. టేబుల్స్ ముందు కూర్చునే కౌటింగ్ సిబ్బందిని ఎలాంటి పక్షపాతం లేకుండా రాండమైజేషన్ ద్వారా ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. కౌటింగ్ ప్రదేశంలోకి ఇతరులెవరికీ ప్రవేశం లేదని, సిబ్బందికి ప్రత్యేకంగా పాసులు జారీచేశామని చెప్పారు.

లెక్కింపునకు 3,356 సిబ్బంది

ఓట్ల లెక్కింపులో 1,916 మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో 3,356 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు రజత్‌కుమార్ తెలిపారు. 20 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటుండగా, మరో 20 వేల మంది ఎన్నికల సిబ్బంది ఉంటారని చెప్పారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు మొత్తం 40 వేల మందిని వినియోగిస్తున్నామన్నారు. స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ పరిసరప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. రాజకీయపార్టీల ఏజెంట్లు కౌంటింగ్ హాల్‌లోకి ఫోన్లు, కాలిక్యులేటర్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించినట్టు సీఈవో తెలిపారు. ఒకసారి లోపలికి వెళ్లిన ఏజెంట్లు కౌంటింగ్ పూర్తయ్యేవరకు బయటికి రావడానికి అనుమతించబోమని స్పష్టంచేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పొగ తాగరాదని తెలిపారు.

ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నట్టు రజత్‌కుమార్ చెప్పారు. రాష్ట్రంలో 44,258 పోస్టల్ బ్యాలెట్లు జారీచేశామని, ఎంతమంది వీటిని వినియోగించుకున్నారనే దానిపై స్పష్టత రాలేదని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తరువాత ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును చేపడుతామని చెప్పారు. రాండమైజ్‌గా ఒక్కో నియోజకవర్గంలో ఒక పోలింగ్‌స్టేషన్‌లోని ఈవీఎంలతోపాటు వీవీప్యాట్లలో ఉన్న స్లిప్‌లను కూడా లెక్కించి అనుమానాలను నివృత్తి చేస్తామని వివరించారు. ఈవీఎంను తెరిచే సమయంలో సమస్యలెదురైతే వెంటనే పరిష్కరించేందుకు భెల్ కంపెనీకి చెందిన 230 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. లెక్కింపు కేంద్రంలోకి మీడియాకు అనుమతిస్తున్నట్టు రజత్‌కుమార్ తెలిపారు. బ్యాచులుగా వెళ్లి ఇక్కడి ఎన్నికల ప్రక్రియను హ్యాండ్‌కెమెరా ద్వారా చిత్రీకరించే అవకాశం కల్పించినట్టు చెప్పారు. కెమెరాలను కూడా అనుమతిస్తున్నట్టు తెలిపారు.

తొలి ఫలితం అశ్వారావుపేటదే?

అతి తక్కువ రౌండ్ల లెక్కింపు ఉన్న కారణంగా అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల ఫలితాలు మొదటిగా వెలువడుతాయని అంచనా వేస్తున్నామని రజత్‌కుమార్ తెలిపారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 42 రౌండ్స్ లెక్కింపు ఉంటుందని చెప్పారు. ప్రతి రౌండ్ ఫలితాన్ని వెంటనే ప్రకటిస్తామని, ఫలితాలను ఈసీవో కార్యాలయంలో లైవ్‌లో చూసే ఏర్పాట్లుకూడా చేశామని వివరించారు. పోలింగ్‌కు ముందుగా ఈవీఎంల పనితీరుపై రాజకీయపార్టీల ఏజెంట్ల ఎదుట మాక్ పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మాక్ పోలింగ్‌లో దాదాపు 10 ఓట్ల వరకు వేసి చూశారు. అనంతరం మాక్ పోలింగ్ ఓట్లను క్లియర్‌చేసి, పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా 38 పోలింగ్ కేంద్రాలలో వాటిని అలాగే ఉంచి పోలింగ్‌ను నిర్వహించారు. దీంతో ప్రజలువేసిన ఓట్లతో అవికూడా కలిసిపోయాయి. 38 పోలింగ్ సెంటర్లలో మాక్ పోలింగ్‌పై ఈసీకి నివేదించామని, వాటి విషయంలో అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు లెక్కింపు కొనసాగిస్తామని రజత్‌కుమార్ తెలిపారు.

RAJATHKUMAR

కేసీఆర్‌కు రెండుచోట్ల ఓటుహక్కు అవాస్తవం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెండుచోట్ల ఓటుహక్కు కలిగిఉన్నట్టు వచ్చిన వార్తల్లో నిజంలేదని ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ రెండుచోట్ల ఓటుంటే పెద్దగా క్రిమినల్ చర్యలేవీ ఉండవన్నారు. సీఎం కేసీఆర్‌పై వచ్చిన ఆరోపణలపై సిద్దిపేట కలెక్టర్‌ను వివరణ కోరామని.. సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో ఒక్కచోట మాత్రమే ఓటు ఉన్నట్టు వెల్లడించారని తెలిపారు. గజ్వేల్‌లో నమోదైన ఓటును ఉపసంహరించుకున్నారని, అయితే అది ఆన్‌లైన్‌లో డిలీట్ కాలేదని వివరించారు. ఓటర్ల సవరణ, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు వెల్లడించే సమయంలో గజ్వేల్‌లో నమోదుచేసుకున్న ఓటును తీసివేసినట్టు కలెక్టర్ చెప్పారని సీఈవో తెలిపారు. రెండుచోట్ల ఓటు వేస్తే శిక్ష ఉంటుందని, పలువురు రెండుచోట్ల ఓటుహక్కు కలిగి ఉంటారని భావించే ఈఆర్వో నెట్ అనే సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.

JITENDHAR-IPS

కౌంటింగ్‌కు పటిష్ఠ భద్రత

-అదనపు డీజీ, ఎన్నికల నోడల్ అధికారి జితేందర్ 
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ఠభద్రత ఏర్పాటు చేసినట్టు శాంతిభద్రతల అదనపు డీజీ, ఎన్నికల నోడల్ అధికారి జితేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తిచేశామని, కౌటింగ్‌ను కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. సోమవారం డీజీపీ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్ట్రాంగ్ రూంలవద్ద మూడంచెల భద్రత కల్పించినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పర్యవేక్షణను ఎస్పీ, డీసీపీ స్థాయి అధికారులకు అప్పగించినట్టు చెప్పారు. పూర్తి ప్రక్రియను వీడియోరికార్డింగ్ చేస్తామని తెలిపారు. కేంద్రాల వద్ద విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి లేదని, ఎవరైనా ర్యాలీలు తీస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

వెబ్‌సైట్‌లో కౌంటింగ్ ఫలితాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఐదు రాష్ర్టాల ఎన్నికల కౌంటింగ్ ఫలితాలను తమ వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను eciresults.inc.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నది.

Leave a Comment