ఇక ప్రచారంఆపండి: సీఈఓ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార గడువు ముగిసిందని, బుధవారం సాయంత్రం నుంచి బహిరంగ సభలు నిర్వహించడం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4.30 గంటల నుంచి, మిగిలిన చోట్లలో సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటలు నిషేధం అమల్లో ఉంటుందన్నారు.

ఈ నిషేధిత సమయంలో బహిరంగ సభల నిర్వహణ, ఎన్నికల ఊరేగింపులు తీయడం, సినిమాలు, టీవీలు లేదా ఇతర పరికరాల ద్వారా ఎన్నికల సందేశాలను ప్రసారం చేయటం, అలాగే ఎలక్ట్రానిక్‌ ప్రచార సాధనాల్లో ఒపీనియన్‌ సర్వేలు, ఇతరత్రా ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను ప్రసారం చేయటం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని వెల్లడించారు. అలాగే పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో కూడా వినోదానికి సంబంధించిన కచేరీలు, స్టేజ్‌ కార్యక్రమాల వంటివి కూడా అనుమతించబోమన్నారు.

ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా ఈ రెండూ విధించే అవకాశముందని వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 126 కింద ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సీఈఓ జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు.

Leave a Comment