ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదేవిధంగా ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి హైకోర్టు నుంచి 14 మంది జడ్జిలను కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు, 10మంది జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు కేటాయించనున్నారు. ఆ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు జనవరి 1 నుంచి విడివిడిగా పనిచేయనున్నాయి.

ఏపీకి 37  తెలంగాణకు 24 ఉమ్మడి హైకోర్టుకు మంజూరు చేసిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 61. అందులో ఏపీకి 37, తెలంగాణకు 24 విభజించారు. ఏపీకి కేటాయించిన వారిలో 28 మంది శాశ్వతన్యాయమూర్తులు, తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తులు ఉంటారు. తెలంగాణ హైకోర్టులో ఈ సంఖ్య 18, 6గా ఉంటుంది.

ప్రస్తుతం 27 మందేప్రస్తుతం హైకోర్టు విభజన అయ్యే నాటికి ఉమ్మడి కోర్టులో 27 మంది సేవలందిస్తున్నారు. అందులో ఏపీకి 14, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ముగ్గురిపై ఇంకా కొలీజియం నిర్ణయం తీసుకుని కేటాయించాల్సి ఉంది. ఇప్పటివరకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్యను బట్టిచూస్తే ఏపీలో 23, తెలంగాణలో 14 జడ్జీల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది.

ఏపీ హైకోర్టుకు కేటాయించిన జడ్జిలు
జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ పవన్ కుమార్, జస్టిస్ వెంకటనారాయణ, జస్టిస్ శేషసాయి, జస్టిస్ శేషాద్రినాయుడు, జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గాప్రసాద్ రావు, జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ శ్యామ్ జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ బాలయోగి, జస్టిస్ రజని, జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ గంగారావు

తెలంగాణకు కేటాయించిన జడ్జిలు
1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్
2. జస్టిస్ మామిడాల సత్యరత్న శ్రీరామచంద్రరావు
3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి
4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావు
5. జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి
6. జస్టిస్ బులుసు శివ శంకర్‌రావు
7. జస్టిస్ డా. షమీమ్ అఖ్తర్
8. జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు
9. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి
10. జస్టిస్ తోడుపునూరి అమర్‌నాథ్ గౌడ్


ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో సేవలందిస్తున్న(సిట్టింగ్‌) 28 మంది న్యాయమూర్తుల్లో 14 మందిని ఏపీకి, 10 మందిని తెలంగాణకు కేటాయించారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.బి.ఎన్‌.రాధాకృష్ణన్‌, జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యంలను ఏ హైకోర్టుకు కేటాయించిందీ ఉత్తర్వుల్లో చెప్పలేదు. వీరి ముగ్గురిపై సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు న్యాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 
ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, కేరళ హైకోర్టున్యాయమూర్తిగా సేవలందిస్తున్న దామా శేషాద్రినాయుడులను ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల జాబితాలో చూపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఐచ్ఛికంగా ఎంచుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పూర్తయిన ఉద్యోగుల ఆప్షన్ల స్వీకరణ..
మరోవైపు ఉద్యోగుల విభజన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 1500 మంది వరకు ఉన్న ఆఫీస్ సబార్డినేట్లు, రికార్డు అసిస్టెంట్లు, బైండర్లు, జమేదార్లు, దఫేదార్లు, బుక్‌బేరర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లు తదితరులను ఇరు హైకోర్టులకు కేటాయించనున్నారు. వీరి నుంచి ఆప్షన్ల స్వీకరణ కూడా పూర్తయింది.

Leave a Comment