చంద్రబాబు నల్లికుట్లోడు మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. చంద్రబాబు నల్లికుట్లోడని, సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతారని చెప్పారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బాబుపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శల్లో తప్పేముందని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బాబు స్పందించకుండా సొల్లు పురాణం మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోరుకుంటున్నారని, ఆయనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. హైటెక్ సిటీకి 1992 మే 21న అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి శంకుస్థాపన చేసినట్టు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగులను ఆయన మీడి యాకు చూపించారు. చంద్రబాబు హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ రాదనడం, దగ్గుబాటిని, జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకొని వదిలేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో తీర్మానం చేశారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు ఎన్ని మాటలు మార్చాడో ఎత్తిచూపితే తప్పా? అని నిలదీశారు.

చంద్రబాబు ఎవరో ఒకరిపై ఆధారపడి ఎన్నికలకు వెళ్లడం అలవాటని, అభివృద్ధి పనులు, అమలు చేసిన పథకాలను చూపెట్టి ఓట్లు అడుగాలే తప్ప వేరే వాళ్ల మీద పడి ఏడ్వటం ఎందుకన్నారు. సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించి, ఓట్లు అడిగి బ్రహ్మాండంగా గెలిచారని గుర్తుచేశారు. కేసీఆర్ భాష కాదని, భావం చూడాలని సూచించారు. ఆయ న ఏదైనా మొఖం మీదనే మాట్లాడుతారని చెప్పారు. కేసీఆర్ ప్రజల్లోనుంచి పుట్టిన నాయకుడని, ఆయనకు ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్నదన్నారు. టీడీపీలో చంద్రబాబు కంటే ముందే కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణతో గోక్కున్నావు ఇక కాచుకో.. అంటూ హెచ్చరించారు. రిటర్న్ గిఫ్ట్ బ్రహ్మాండంగా ఉంటుందని స్పష్టంచేశారు. చంద్రబాబు నిప్పు అయితే ఆయనపై ఉన్న కేసుల్లో స్టేలను ఎత్తివేయించుకోవాలని సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఏపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.

కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం: తలసాని

ఏపీ సీఎం చంద్రబాబుకు ముసుర్ల పండుగ ముందున్నదని, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. లోటు బడ్జెట్ అంటూనే దీక్షల పేరుతో రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఏపీ మంత్రులకు ఆర్థికశాస్త్రంలో ట్యూషన్ చెప్పడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ నాయకుడు రామ్మూర్తియాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఒక సిద్ధాంతం, పాలసీ ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించాలని పిలుపునిచ్చాడని, ఆయన ఏపీలోనూ అదేపని చేస్తారా అని నిలదీశారు. మంచి జరిగితే తానే చేసినట్టుగా ప్రచారం చేయడం, చెడు జరిగితే ఇతరులపై నెట్టేయడంలో బాబు సిద్ధహస్తుడన్నారు.

నాలుగేండ్లు బీజేపీతో అంటకాగి, ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు బీజేపీకి సంబంధం అంటగడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారని, రూ.300 కోట్లు మీడియా ప్రకటనలకే వెచ్చించారని ఆరోపించారు. 400 ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను, సైబారాబాద్‌ను కట్టానని చెప్పుకొనే చంద్రబాబు నాలుగున్నరేండ్లలో అమరావతిని ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. గ్రాఫిక్స్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, బాబు డబ్బా బ్యాచ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ మాట్లాడివన్నీ వాస్తవాలే: ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, బిగాల గణేశ్‌గుప్తా

వినాయక్‌నగర్: చంద్రబాబును ఉద్దేశించి సీఎం కేసీఆర్ శనివారం మాట్లాడినవన్నీ వాస్తవాలేనని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పేర్కొన్నారు. కేసీఆర్‌పై బాబు, ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివారం వారు నిజామాబాద్‌లోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు, ఆంధ్ర కుట్రదారులు కలిసి తెలంగాణను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో సచివాలయాన్ని కట్టించానని చెప్పుకొంటున్న బాబు.. ఏపీలో ఏమేం కట్టించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు లాక్కున్న విషయం మరిచిపోవద్దన్నారు. కాంగ్రెస్, టీడీపీ తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను చిన్నాభిన్నం చేశాయని ధ్వజమెత్తారు.

హైకోర్టు విభజన, తెలంగాణ సమస్యల కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే, ఎన్ని కేసులు మాఫీ చేయించుకొని వచ్చారని ఏపీ నాయకులు అంటున్నారని, మరి చంద్రబాబు నాలుగేండ్లపాటు ప్రధాని మోదీతో సన్నిహితంగా ఉండి ఎన్ని కేసులు మాఫీ చేయించుకున్నారని ప్రశ్నించారు. విశాఖపట్నంలో సీఎం కేసీఆర్‌కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికితే.. వైసీపీ కార్యకర్తలు స్వాగతించారని పేపర్లలో రాయించుకోవడం సరికాదన్నారు. ప్రపంచం మొత్తం తెలంగాణను మెచ్చుకుంటుంటే చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని, హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇన్నాళ్లూ బీసీలను ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకొని అధికారం చెలాయించాయని, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ వాస్తవాలు చెప్పారు

సీఎం కేసీఆర్ శనివారం మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాస్తవాలు చెప్పారని విజయవాడకు చెందిన ఆదినారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌కు వచ్చి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు స్వీట్స్ తినిపించారు. చంద్రబాబు కుతంత్రాలను కేసీఆర్ బయటపెట్టారని అభినందించారు. ఏపీ ప్రజలకు కేసీఆర్ వంటి నాయకుడు ఎంతో అవసరమని చెప్పారు.

Leave a Comment