వైభవంగా మల్లన్న కల్యాణం

చేర్యాల: భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామివారి కల్యాణోత్సవం ఆదివారం ఆలయ తోటబావి ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారికి శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు పట్టువస్ర్తాలు, ముత్యా ల తలంబ్రాలు సమర్పించారు. ఈ మహోత్సవానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. దాదాపు 50 వేల మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటలకు ఆలయవర్గాలు రెండు క్వింటాళ్ల బియ్యంతో అన్నంవండి రాశిగా పోసి దృష్టికుంభం కార్యక్రమాన్ని నిర్వహించాయి. స్వస్తిశ్రీ విళంబినామ సంవత్సరం మార్గశిర మాసం బహుళ నవమి ఆదివారం ఉదయం 10:45 గంటలకు కల్యాణోత్సవం కన్నులపండువగా సాగింది. 

ఏపీలోని శ్రీశైలం పీఠాధిపతి శ్రీమద్ జగద్గురు 1008 డాక్టర్ సిద్ధరామ పండితారాధ్య శివాచార్యా స్వామిజీ పర్యవేక్షణలో వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణం నిర్వహించారు. కల్యాణవేదికలో అమ్మవార్ల తరఫున మహాదేవుని వంశస్థులు మానసమల్లికార్జున్ దంపతులు, స్వామివారి తరఫున పడిగన్నగారి మాధవిమల్లికార్జున్ దంపతులు, గర్భగుడిలో జరిగిన స్వామివారి పెండ్లిలో అమ్మవారి తరఫున మహాదేవుని అనసూర్యసాంభయ్య, స్వామివారి తరఫున పడిగన్నగారి అర్చనఆంజనేయులు పాల్గొన్నారు. అంతకుముందు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అర్చకులు ఆలయం నుంచి పోలీసుబొమ్మ, రాతిగీరలు, ఆలయ పరిసరాల్లో ఊరేగించి మేళతాళాలు, కోలాటం, చెక్కభజనలు, వేదపాఠశాల విద్యార్థుల శివకీర్తనల మధ్య కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 

గ్రామపంచాయతీ తరఫున ప్రత్యేక అధికారి రమాకాంతారావు, ఒగ్గు పూజారులు పట్టువస్ర్తాలు, పుస్తెమట్టెలు సమర్పించారు. సీఎం కేసీఆర్ సోదరుడి కుమారుడు, కోడలు తేజేశ్వర్‌రావు(కన్నారావు), విజత్‌రావు దంపతులు స్వామివారి కల్యాణోత్సవానికి హాజరయ్యారు. అనంతరం ఆలయంలో మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ సోషల్ సర్వీసెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిపిరెడ్డి మహేశ్‌రెడ్డి, ప్రశాంత్‌రావు, సింగిరెడ్డి జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన తండ్రి తలసాని వెంకటేశం పేరిట మల్లన్నక్షేత్రంలో నిర్మించిన స్వాగత తోరణాన్ని మండలి విప్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మల్లన్న ముత్యాల తలంబ్రాలు

కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామివారి కల్యాణోత్సవానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాన్ని ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అందజేశారు. ఆదివారం మధ్యాహ్నం మల్లన్నక్షేత్రంలో కల్యాణం ముగిసిన వెంటనే హైదరాబాద్ వెళ్లిన మండలి విప్, ఎమ్మెల్యే, ఆలయ పాలకమండలి చైర్మన్ సెవెల్లి సంపత్‌యాదవ్, ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేశ్, ఆలయ అర్చకులతో కలిసి సీఎం కేసీఆర్‌కు తలంబ్రాలు, ప్రసాదం అందజేశారు.

Leave a Comment