ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు మేడారం మినీ జాతర

మేడారం మినీ జాతరకు పూజారులు సిద్ధం
జయశంకర్ భూపాలపల్లి: తాడ్వాయి మండలంలోని ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్కల మినీ జాతర (మండె మెలిగె పండుగ) నిర్వహణకు అమ్మవార్ల పూజారులు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు తల్లుల ఉత్సవం నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేశారు.

అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, అమ్మవార్ల పూజారులు సమావేశం ఏర్పాటు చేసి జాతర వివరాలను వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 20 నుంచి మాఘ శుద్ధ పౌర్ణమి వస్తుండటంతో పూజారులు అమ్మవార్ల మినీ జాతర ఏర్పాటుకు తేదీలను నిర్ణయించారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే అమ్మవార్ల మహాజాతర మాదిరిగానే ప్రతీ సంవత్సరం అమ్మవార్లకు మినీ జాతరను నిర్వహిస్తారు.

తల్లులను గద్దెల పైకి తీసుకురావడం మినహా మిగతా పూజా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మేడారంలోని సమ్మక్క దేవత పూజా మందిరంలో సమ్మక్క గద్దెను అలంకరించడంతో పాటు కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయంలో గద్దెలను అలకడం, దూపదీప నైవేద్యాలు సమర్పించడం, గద్దెల వద్ద జాగారాలు చేయడం, అత్యంత నియమనిష్టలతో వారం రోజుల పాటు తల్లులకు పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. తల్లుల పూజల కోసం భద్రపరిచిన పూజాసామగ్రిని బయటకు తీసి పూజలు చేసిన అనంతరం తిరిగి భద్రపరచడంతో అమ్మవార్ల మినీ ఉత్సవం పూర్తవుతుంది. ఈ సమావేశంలో పూజారులు మునిందర్, లక్ష్మణ్‌రావు, కాక సారయ్య, కిరణ్, మహేష్, భుజంగరావు, భోజరావు, నర్సింగరావు పాల్గొన్నారు.

Leave a Comment