తారక్‌కి బాబాయ్‌ ఇచ్చిన గౌరవం అది!

‘ఎన్టీఆర్‌ బయోపిక్‌లో చిన్న ఫొటో కనిపించినా చాలు..’ అని చెప్పిన కల్యాణ్‌రామ్‌కి ఏకంగా హరికృష్ణ పాత్ర దక్కింది. చైతన్య రథ సారథి హోదా వచ్చింది. తాతగారి కథ.. బాబాయ్‌ తీస్తున్న సినిమా.. అందులోనూ నాన్న పాత్ర! ఇంతకంటే కల్యాణ్‌రామ్‌కి ఏం కావాలి? అందుకే కల్యాణ్‌ రామ్‌ కళ్లలో కొత్త వెలుగు కనిపిస్తోంది. ‘‘తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌. ఆయన మనవడిగా కాదు.. ఓ అభిమానిగా ఆయన కథని వెండి తెరపై చూసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నా’’ అంటున్నారాయన.  ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ ఈనెల 9న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌‌ గురువారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సంభాషించారు.

హరికృష్ణగా కల్యాణ్‌ రామ్‌.. అసలు ఇలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా?
(నవ్వుతూ) అసలు ఇలాంటి సినిమా వస్తుందనే అనుకోలేదు. ‘ఎన్టీఆర్‌’ కథ చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎంతో అంకితభావం ఉండాలి. ఏదో మ్యాజిక్‌ జరిగితే తప్ప ఇలాంటి సినిమా రాదనుకునేవాణ్ని. ఆ మ్యాజిక్‌ మా బాబాయ్‌ చేశారు.

ఎన్టీఆర్‌ మనవడిగా కాకుండా ఓ అభిమానిగా చెప్పండి. తెరపై ‘ఎన్టీఆర్‌’ కథని ఏ కోణంలో చూడాలనుకుంటున్నారు?
ఆయన జీవితంలో జరిగిన నిజమైన   సంఘటనల్ని చూడాలనుకుంటున్నా. ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? పరిశ్రమకు ఎలా వచ్చారు? రాక ముందు ఆయనకు ఏమైనా అవమానాలు ఎదురయ్యాయా? ఎవరైనా ఆయన్ని చులకనగా చూశారా? ఇలాంటివన్నీ తెలుసుకోవాలని ఉంది. ఆయన కుటుంబంతో ఎలా ఉండేవారు? వాళ్లకిచ్చే ప్రాధాన్యం ఎంత? ఇవన్నీ అభిమానులందరికీ ఆసక్తి కలిగించే అంశాలే. రామారావు గారికి రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలనిపించింది? అని అడిగితే జనాలు రకరకాల కథలు చెబుతుంటారు. నిజానికి నాక్కూడా సరిగా తెలీదు. అవన్నీ తెరపై చూడాలని ఉంది.

మీ నాన్నగారు గానీ, ఇంట్లో వాళ్లుగానీ మీ తాతగారి గురించి చిన్నప్పుడు ఎలాంటి విషయాలు చెప్పేవారు. వాటిలో మీకు గుర్తుండిపోయిన సంగతులేంటి?
చాలా చెప్పేవారు. ‘అబ్బో’ అనిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అన్ని తెలిసిన నాకే.. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌   చేస్తున్నప్పుడు ఇంకొన్ని కొత్త విషయాలు తెలిశాయి. చలపతిరావు బాబాయ్‌ తాతయ్య గురించి చాలా చెప్పేవారు. వాటిలో ఓ సంఘటన నాకు బాగా గుర్తు. ‘దానవీరశూర కర్ణ’ షూటింగ్‌ జరుగుతోందట. విడుదలకు ఎంతో సమయం లేదు. అంతా కంగారు కంగారుగా ఉన్నారు. గండిపేట సమీపంలో షూటింగ్‌. అప్పటికప్పుడు ‘నాకొక ఏనుగు కావాలి’ అన్నారట. ‘ఓ గంటలో ఏనుగు పట్టుకురండి. అప్పటి వరకూ షూటింగ్‌ లేదు’ అని ఆర్డరు వేశారట అదేమైనా సైకిలా.. వెంటనే తీసుకురావడానికి. ఇప్పుడు అదెక్కడ దొరుకుతుంది? నాన్నగారు కంగారు కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ రోడ్డు మీదకు వచ్చారట. ‘పెద్దాయనకు ఏం చెప్పాలి’ అనే ఆందోళన ఆయనది. అయితే మార్గం మధ్యలో సర్కస్‌ కంపెనీ ఒకటి ఒక ఊరి నుంచి మరో ఊరు వెళ్తూ కనిపించిందట. వాళ్ల గుంపులో ఏనుగు ఉంది. దాంతో వెదక బోయిన తీగ కాలికి తగిలినంత సంబరపడ్డారట నాన్న. తాతగారి మనసులో ఏనుగు కావాలి అనుకోవడం ఏంటి? అది అప్పటికప్పుడు దొరకడం ఏంటి? అదంతా దైవ సంకల్పం. ఇలాంటి విచిత్రమైన సంగతులు తాతయ్య గారి విషయంలో చాలా జరిగాయి.

తాతా మనవళ్లగా మీ మధ్య అనుబంధం..?
ఆయన దగ్గరకు అప్పుడప్పుడు వెళ్తుండేవాణ్ని. చిన్న  పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. ‘నాన్న..’ అంటూ  ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేవారు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఆయనకూ అంతే. ‘ముందు బాగా చదవాలి.. ఆ తరవాతే.. అల్లరి’ అని చెబుతుండేవారు. తాతగారు నా కళ్లకు ఓ శిఖరంలా కనిపిస్తుండేవారు. ఆయన చుట్టూ  బోలెడంత మంది జనం. ఆయన మనవళ్లుగా మేం ఏం చేయకపోయినా మాకు విపరీతమైన గౌరవం దక్కేది. ఆయన ఇంట్లో పుట్టినందుకే ఇంత గౌరవం అంటే ఆయన ఇంకెంత గొప్పవారో అనిపించేది.

తాతయ్య గెటప్‌లో బాబాయ్‌ని చూసినప్పుడు  ఏం అనిపించింది?
పేపర్లో ఆయన లుక్కులు చూసి చాలా సంతోషంగా  అనిపించేది. అయితే చైతన్య రథం సన్నివేశం తీస్తున్నప్పుడు తొలిసారి ఆ గెటప్‌లో బాబాయ్‌ని చూసి షాకయ్యా. ‘అచ్చం తాతగారిని చూస్తున్నట్టే ఉంది’ అని ఆయనతో చెప్పా. ‘ఇక చాలు తాతగారిని మళ్లీ చూసేశా’ అన్నంత ఆనందం కలిగింది.

మిమ్మల్ని ఈ గెటప్‌లో చూసి ఇంట్లోవాళ్లేమన్నారు?
తమ్ముడికి తప్ప ఈ గెటప్‌ ఇంకెవ్వరికీ చూపించలేదు. మా అమ్మకి అస్సలు చూపించాలనుకోలేదు. తారక్‌కి బాగా నచ్చింది. నాన్నగారు ఉన్నప్పుడే బాబాయ్‌ నుంచి ఈ ఆఫర్‌ అందింది. ఈ పాత్ర చేస్తున్నా అనే సంగతి నాన్నకీ తెలుసు. కానీ నా గెటప్‌ చూడలేదు. నాన్న ఉంటే బాగుండేది, కనీసం నా గెటప్‌ చూసినా బాగుండేది అనిపిస్తోంది.

ఈ సినిమాలో తమ్ముడు తారక్‌ కూడా ఉండుంటే  బాగుండేది అనిపించిదా?
ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఈ సినిమాలో బాలకృష్ణ గారి పాత్ర లేదు. ‘నా సినిమా కదా.. నా పాత్ర లేకుంటే ఎలా..?’ అని బాబాయ్‌ అనుకోలేదు. రేపు అభిమానులూ అనుకోరు. కథకి ఏం కావాలో అదే చూపించారు. మేమంతా సినిమాలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగం అయితే చాలు అనుకున్నాం. ‘నా ఫొటో తెరపై కనిపిస్తే చాలు’ అనుకున్నవాడికి మా నాన్నగారి పాత్ర ఇచ్చారు. ఇక తమ్ముడంటారా? సినిమా ప్రచారంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం.. పాటల ఆవిష్కరణ. అది తమ్ముడి చేతుల మీదుగా జరిగింది.  తారక్‌కి బాబాయ్‌ ఇచ్చిన గౌరవం అది. అంతకంటే ఏం కావాలి? ‘ఇదిగో ఈ పాత్ర చేయ్‌’ అని ఏదోటి అప్పగించొచ్చు. ‘మరీ ఇంత చిన్న పాత్ర ఇస్తారా’ అంటూ రేపు అభిమానులే నిరుత్సాహపడొచ్చు. ప్రేమ అనేది మనసులో ఉంటుంది. అది ప్రదర్శించుకునే వస్తువు కాదు. నా పిల్లలకు నేను రోజూ ఐ లవ్‌ యూ చెప్పను. అలాగని మా మధ్య ప్రేమ లేనట్టా? జనం రకరకాలుగా మాట్లాడుకుంటారు. అది వాళ్ల నైజం. వాళ్లు మాట్లాడుకునే ప్రతి విషయానికీ సమాధానం చెప్పాలా, వద్దా? అనేది మా ఇష్టం. నేను కూడా తమ్ముడు ఉన్నాడు కదా అని ‘ఇదిగో నా సినిమాలో ఇలా వచ్చి నవ్వేసి వెళ్లిపో’ అనగలనా? తనో సూపర్‌ స్టార్‌. ఆ స్థాయికి నేను గౌరవం ఇవ్వాలి కదా..?

బాబాయ్‌ తరవాత.. ఈ సినిమాలో ఎవరి గెటప్‌ మీకు బాగా నచ్చింది?
సుమంత్‌గారిది బాగా నచ్చింది. ఆయన్ని అసలు ఆ కోణంలో ఎప్పుడూ చూడలేదు. నాగేశ్వరరావుగారిలా  ఉంటాడని ఎప్పుడూ అనుకోలేదు. కానీ గెటప్‌ రాగానే.. భలే ఉందే అనుకున్నా. ఆ తరవాత చంద్రబాబు నాయుడుగారిలా రానా గెటప్‌ కూడా బాగుంది.

తెలంగాణ ఎన్నికల సమయంలో మీపేరు బాగా వినిపించింది. ప్రచారానికి వస్తారని కూడా అనుకున్నారు. కానీ రాలేదేం..?
వ్యక్తిగత కారణాల వల్లే రాలేకపోయా. అయినా ఎన్నికలు అయిపోయాయి కదా. ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు..?

చిన్నప్పుడు బాబాయ్‌తో కలసి ‘బాలగోపాలుడు’లో నటించా. నాకు పదేళ్లు ఉంటాయేమో. షూటింగు, నటన, కెమెరా.. అసలు ఈ పదాలకు అర్థమే తెలిసేది కాదు. షూటింగ్‌కి వెళ్లామా, కేకులు, కూల్‌ డ్రింకులు ఇచ్చారా? అనే లెక్కలేసుకునేవాళ్లం. ఈసారి కూడా కేకులు బాగా తిన్నా. ఎందుకంటే ఈ పాత్ర కోసం పది కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి ఓ రకంగా బాబాయ్‌నే. చిన్నప్పుడు పైలెట్‌ అవ్వాలని అనుకునేవాణ్ని. కానీ నా ఆలోచనా విధానాన్ని మార్చేశారు బాబాయ్‌. అందుకే ఆయనకు గురు స్థానం ఇచ్చా. ‘ఎన్టీఆర్‌’ సెట్లో మళ్లీ ఆయనతో కలసి నటిస్తున్నప్పుడు ‘గురువుగారు ఏమనుకుంటారో’ అనే భయం, ఆలోచనా మనసులో ఉండేవి.

Leave a Comment