తెలంగాణ రాష్ట్రంలో కలుస్తామంటూ మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల సర్పంచులు డిమాండ్ చేశారు

తాము తెలంగాణ రాష్ట్రంలో కలుస్తామంటూ మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల సర్పంచులు డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమకు ఎటువంటి పథకాలను ప్రవేశపెట్టడం లేదని.. కనీసం తాగునీరు కూడా లేక ధర్మాబాద్ తాలూకాలోని 35 గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరిగ్గా ఉండటం లేదని.. రూ.600 పింఛన్ ఇవ్వడానికి పదిసార్లు తిప్పుకుంటారని విచా రం వ్యక్తంచేశారు. గురువారం నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌లోని పంచాయతీ కార్యాలయం ఎదుట 42 గ్రామాల సర్పంచులు బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు. హమారేకో తెలంగాణమే మిలాలో.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడారు.

ధర్మాబాద్‌లో సరైన దవాఖాన లేకపోవడంతో ఓ గర్భిణిని ప్రసవం కోసం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్తే అక్కడి వైద్యులు ఉచితంగా డెలివరీచేసి గర్భిణీకి కేసీఆర్ కిట్‌ను అందించారని వివరించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేశారన్నారు. గతేడాది మే మాసంలో 42 గ్రామాల సర్పంచులు, ప్రజలు తమను తెలంగాణలోకి తీసుకోవాలని దీక్షలు చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి రూ.40 కోట్లు కేటాయించిందన్నారు. అయినప్పటికీ ఆ నిధులు తమకు చేరలేదన్నారు. ప్రభుత్వ తీరులో మార్పు రాకపోవడంతో తాము ఎలాగైనా తెలంగాణలో కలువాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కేసీఆర్ సార్ తమ బాధలు పట్టించుకొని ఒకసారి ధర్మాబాద్‌ను సందర్శించాలని కోరారు.

తెలంగాణ పథకాలు బాగున్నాయి

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణిలక్ష్మి పథకాలు బాగున్నాయని వారు పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాబురావు, లక్ష్మణ్, సంతోష్, అప్సార్, గోవింద్, వినయ్, శంకర్, రాం, మాజీ కౌన్సిలర్లు రవీందర్, మహ్మద్ మతిన్, శంకు పటేల్, మహేశ్ జోషి, రమేశ్ తివారీ పాల్గొన్నారు.

Leave a Comment