అసెంబ్లీ సమావేశాల భద్రతపై సమీక్ష

హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు భద్రతపై దృష్టిసారించారు. సోమవారం అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లో మండలి చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. దీనికి డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్‌త్రివేది, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్‌భగవత్, స్పెషల్ పోలీస్ డీజీ తేజ్‌దీప్‌కౌర్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు హాజర య్యారు. సమావేశం అనంతరం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ శాసనసభ, శాసనమండలి ఆవరణలో కలియదిరిగారు. పార్కింగ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలో సిబ్బందికి సూచించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు మజ్లిస్ ఎమ్మె ల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయనున్నారు. 17న ఉదయం 11.30గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్‌ఖాన్ ప్రమాణం చేయిస్తారు. 18న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 19న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 20న బీఏసీ సమావేశం నిర్వహించి, సభను ఎన్నిరోజలు కొనసాగించాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

సమావేశాలకు ముస్తాబైన అసెంబ్లీ

ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న శాసనసభ్యులకు స్వాగతం పలికేందుకు అసెంబ్లీని సుందరంగా ముస్తాబుచేశారు. రంగులు వేయడంతోపాటు ఆవరణలో పూల మొక్కలను నాటారు. ఎలక్ట్రిక్, ఇతర మరమ్మతు పనులు పూర్తిచేశారు. సభ జరిగే హాల్‌లో కొత్త గ్రీన్ కార్పెట్ పరిచారు. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారానికి కావాల్సిన అన్ని హంగులు సమకూర్చారు. ఏపీ కౌన్సిల్ నిర్వహించే హాల్‌ను, మంత్రుల చాంబర్లను తెలంగాణకు అప్పగించడంతో తెలంగాణ సీఎంకు కొత్త చాంబర్‌ను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలో పచ్చదనం ఉట్టిపడేలా ఏర్పాట్లుచేశారు. ఆయా పార్టీల కార్యాలయాలకు కొత్త బోర్డులను బిగించారు. మీడియా పాయింట్‌ను, క్యాంటీన్‌ను ఆధునీకరించారు. డిస్పెన్సరీ, లైబ్రరీ, ఫుట్‌పాత్ ఇలా అన్ని ముఖ్యమైన ప్రదేశాలను అందంగా తీర్చిదిద్దారు. అసెంబ్లీ వెబ్‌సైట్‌ను సైతం ఆధునీకరించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌కు సంబంధించిన సకల సమాచారం అందుబాటులో ఉండేలా రూపొందించారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల సమాచారాన్ని ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. నియమ నిబంధనలు, కమిటీలు వంటి వివరాలను అప్‌డేట్ చేశారు. గతంలో సభలో జరిగిన చర్చలు, గవర్నర్ ప్రసంగాలు, తీర్మానాలను ఇందులో పొందుపర్చారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజుల్లోని అజెండా వివరాలు, ప్రశ్నలు సైతం ఇందులో ఉన్నాయి. జీఐఎస్ మ్యాప్‌లను, కొత్త జిల్లాలవారీగా నియోజకవర్గ మ్యాప్‌లను అందుబాటులో ఉంచారు.

మీడియాపై ఆంక్షలు లేవు

అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు 
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు విధించారన్న వార్తలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తోసిపుచ్చారు. సమావేశాల సందర్భంగా రొటీన్‌గా విడుదలచేసే మార్గదర్శకాలను కొన్ని పత్రికలు వార్తగా ప్రచురించాయే తప్ప మీడియాపై ఆంక్షలు పెడుతున్నారన్నది వాస్తవం కాదన్నారు.

Leave a Comment