సిటీ మధ్యలో ఏకంగా అడవినే సృష్టించాడు..!

Related Post

  • No related post.

మీరు అడవిని చూశారా ఎప్పుడైనా? పోనీ.. సిటీ మధ్యలో ఉన్న అడవిని ఎప్పుడైనా చూశారా? ఖచ్చితంగా చూసి ఉండరు. ఎందుకంటే.. సిటీ మధ్యలో అసలు అడవి ఉండదు కదా. కానీ.. మీరు కేరళలోని కొచ్చికి వెళ్తే సిటీ మధ్యలో మీకు ఒక అడవి కనిపిస్తుంది. కాకపోతే.. అది సహజసిద్ధంగా పుట్టిన అడవి కాదు. దాన్ని ఓ వ్యక్తి 35 ఏళ్ల పాటు కష్టపడి సృష్టించాడు. కేవలం 2 ఎకరాల్లోనే అడవిని సృష్టించి ఇప్పుడు చరిత్రకెక్కాడు. ఆయన పేరు ఏవీ పురుషోత్తమ కామత్. ఆ అడవిలో 2000 రకాల అరుదైన మెడిసిన్ ప్లాంట్స్, 400 రకాల పండ్ల చెట్లు, పూల చెట్లు, కూరగాయలు, మూలికలు ఉన్నాయి. 

అంతేనా.. అది సిటీలో ఉన్నప్పటికీ.. ఆ అడవిలో జీవవైవిధ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రకరకాల పక్షులు, వలస వచ్చిన పక్షులు, సీతాకోకచిలుకలకు ఆ అడవి నిలయం. ఇప్పుడు ఆ అడవి చాలామంది టూరిస్టులను ఆకర్షిస్తోంది. బోటనీ విద్యార్థులకు అదో ప్రాజెక్ట్. అడవిలోని ప్రతి చెట్టుకు ఓ బోర్డు ఉంటుంది. అది ఏ చెట్టు. దాని వల్ల ఉపయోగం ఏంటి. దాని శాస్త్రీయనామం.. ఇలా దానికి సంబంధించిన అన్ని వివరాలను ఆ బోర్డును పొందుపరిచారు కామత్. 

నిజానికి కామత్ ఓ బ్యాంకర్. 1970లో బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టిన కామత్.. ఉద్యోగ రిత్యా తరుచూ ప్రయాణం చేయాల్సివచ్చేది. ఆయనకు చెట్లన్నా, వ్యవసాయం చేయడమన్నా మహా ఇష్టం. అందుకే.. ఎక్కడికెళ్లినా ఒకటో రెండో మొక్కలను తీసుకొచ్చి తన ఇంట్లో పెంచుకునేవారు. అయితే.. 1984లో తన తల్లికి ఆరోగ్య సమస్యలు రావడంతో తన జాబ్‌ను వదిలేసి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అలా.. తన ఇంటి చుట్టూ ఖాళీగా ఉన్న రెండు ఎకరాల్లో చెట్లు నాటడం ప్రారంభించారు. తర్వాత రకరకాల మొక్కలను, మెడిసిన్ ప్లాంట్లను తీసుకొచ్చి నాటడం ప్రారంభించారు కామత్. 1996 నుంచి చెట్లను పెంచడం కోసం కెమికల్స్ ఉపయోగించడం మానేశారు కామత్. అలా తన రెండెకరాల స్థలంలో రకరకాల చెట్లను నాటారు. 

42 రకాల మామిడి చెట్లు, స్ట్రాబెర్రీ, జాక్‌ఫ్రూట్, సపోటా, ఆపిల్, బ్లాక్ బెర్రీ, అవకాడో, నిమ్మ, స్టార్ ఫ్రూట్, లిట్చీ, మల్‌బెర్రీ, ఆరెంజ్, పీచ్.. ఇలా అన్ని రకాల పండ్ల చెట్లు ఆ అడవిలో ఉన్నాయి. అంతే కాదు.. సహజసిద్ధంగా అన్ని కూరగాయలూ పండిస్తారు కామత్. మెడిసిన్ ప్లాంట్స్ అయినటువంటి అలొవెరా, అశ్వత్త, అశోక, రుద్రాక్షం, బ్రహ్మీ, దేవదారు, యూకలిప్టస్, జత్రోపాతో పాటు ఓ నర్సరీని కూడా ఏర్పాటు చేశారు. నర్సరీలోని మొక్కలను అమ్మేస్తారు. అడవిలోని చెట్లకు నీళ్లు పెట్టడం కోసం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. అడవి మధ్యలో చిన్న కొలను ఉంటుంది. ఆ కొలను నుంచి నీటిని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చెట్లకు పంపిస్తారు. 

మరోవైపు ఆవులు, నాటుకోళ్లు, రకరకాల పిట్టలను కూడా పెంచుతారు. అవి పెట్టే గుడ్లను అమ్ముతారు. ఆవుల పేడను ఎరువుగా ఉపయోగిస్తారు. ఆ అడవిలో వెర్మీకంపోస్ట్ యూనిట్ కూడా ఉంది. ఆ అడవిలో ఉత్పత్తయ్యే చెత్త ద్వారానే ఎరువును తయారు చేసి వాటినే చెట్లను వేస్తారు. కామత్‌తో పాటు.. ఆయన కొడుకు ఆనంద్, ఆనంద్ భార్య, వాళ్ల పిల్లలు కూడా ఆయనకు తోడుగా అడవి పెంపకంలో సాయం చేస్తారు. ఆనంద్ కూడా తన జాబ్‌ను వదిలేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ అడవి సంరక్షణలో సహాయపడుతున్నారు. 

దాదాపు 35 సంవత్సరాలు కష్టపడి పెంచిన అడవికి గుర్తుగా కామత్‌కు 2013లో కేరళ బయోడైవర్సిటీ అవార్డుతో పాటు వనమిత్ర అవార్డు దక్కింది. అంతే కాదు.. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆత్మ అనే కార్యక్రమం ద్వారా ఆ అడవిని గుర్తించి.. ఇంకా ఆధునిక పద్ధతుల ద్వారా ఎలా చెట్లను పెంచాలనే దానిపై కామత్‌కు ట్రెయినింగ్ ఇస్తున్నారు. 

అంతా బాగానే ఉంది కానీ.. కొచ్చి మధ్యలో.. అది కూడా మెట్రో స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ అడవిపై రియల్టర్ల కన్ను కూడా పడిందట. దాన్ని అమ్మాలని.. ఎక్కువ రేటు ఇచ్చైనా కొంటామని చాలామంది కామత్‌ను కలిశారట. అడవిని చూడటానికని వచ్చి చివర్లో దీన్ని అమ్మితే చాలా డబ్బులు ఇస్తామని ప్రలోభపెట్టారట. ఎటువంటి ప్రలోభాలు వచ్చినా కామత్ మాత్రం ఆ అడవిని అమ్మనని ఖరాఖండీగా చెప్పేశారట. ఇది ఆ అడవిని సృష్టించిన కామత్ స్టోరీ.

 

Leave a Comment