Telangana State Information Commissione, Samachara Hakku Bhavan, Mozam-Jahi Market, Hyderabad

ఇంటర్‌ బోర్డుకు సహచట్టం వర్తిస్తుంది. జవాబు పత్రాలు అడిగితే ఇవ్వాల్సిందే. సహచట్టం కింద ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు

ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం సమాచార హక్కు(సహ) చట్టం పరిధిలోకి వస్తుందని రాష్ట్ర సమాచార కమిషన్‌ వర్గాలు ‘ఈనాడు’కు చెప్పాయి. సహ చట్టం కింద దేశరక్షణకు సంబంధించిన రహస్య పత్రాలు, కేంద్ర ప్రభుత్వ ఇంటిలిజెన్స్‌, భద్రతా సంస్థలు తప్ప మిగతా కార్యాలయాలన్నీ సమాచారం ఇవ్వాల్సిందే. పరీక్షలు రాసిన విద్యార్థులు తమ జవాబు పత్రాల నకలు కాపీలను సహ చట్టం కింద పొందడం వారి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు గతంలో వెల్లడించిన ఓ తీర్పులో చెప్పింది. సీబీఎస్‌ఈ నుంచి జవాబు పత్రాలను ఇప్పించాలని ఆదిత్య బందోపాధ్యాయ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా.. ‘‘ఒక విద్యార్థి రాసిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి మార్కులు వేసిన తరువాత అవి సహచట్టంలోని 2(ఎఫ్‌) సెక్షన్‌ కింద అధికార రికార్డుల కిందకు వస్తాయి. వాటిని తనిఖీ చేసేందుకు విద్యార్థికి ప్రాథమిక, న్యాయపరమైన హక్కు ఉంది’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంటర్‌ పరీక్షలు రాసిన ఏ విద్యార్థి అయినా తన జవాబు పత్రాల నకలు కాపీ కోసం ఇంటర్‌బోర్డు ‘ప్రజా సమాచార అధికారి’(పీఐఓ)కి దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు రుసుం కింద రూ.10 పోస్టల్‌ ఆర్డర్‌ను జతపరచాలి. ఇది కాకుండా జవాబు పత్రాలను ఇవ్వడానికి బోర్డు ఇతరత్రా రుసుం చెల్లించమని అడిగితే దాన్ని బ్యాంకు డిమాండు డ్రాఫ్ట్‌(డీడీ) రూపంలో విడిగా చెల్లించాలి. నిర్ణీత రుసుం ఏమీ లేకపోతే నకలు కాపీ జిరాక్స్‌ తీయించి ఇవ్వడానికి ఒక్కో పేజీకి రూ.2 చొప్పున బోర్డు తీసుకోవాలి. దరఖాస్తు చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా పీఐఓ సమాచారం ఇవ్వాలి. ఒకవేళ పీఐఓ ఇవ్వకపోతే బోర్డు కార్యాలయ అధిపతిగా ఉండే మొదటి అప్పిలేట్‌ అధికారికి మళ్లీ దరఖాస్తు చేయాలి. పీఐఓ నుంచి సమాచారం ఇప్పించే బాధ్యత మొదటి అప్పిలేట్‌ అధికారిదే. అప్పిలేట్‌ అధికారి కూడా స్పందించకపోతే రెండో(తుది) అప్పీలును హైదరాబాద్‌లోని మొజాంజాహీ మార్కెట్‌లో ఉన్న రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యాలయంలో దరఖాస్తుదారుడు ఇవ్వాలి. అప్పుడు పీఐఓను కమిషన్‌కు పిలిపించి విచారణ జరిపి సమాచారం ఇప్పిస్తుంది. సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు పీఐఓకు రూ.25 వేల వరకు జరిమానా సైతం విధించే అధికారం ఉందని రాష్ట్ర సమాచార కమిషన్‌ వర్గాలు వివరించాయి.

సీబీఎస్‌ఈకి నోటీసులు
జవాబు పత్రాల కాపీలను ఇవ్వడానికి ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌’ (సీబీఎస్‌ఈ) అధికంగా రుసుం వసూలు చేస్తోందని ఇటీవల సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై సమాధానం చెప్పాలని బోర్డుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.

ప్రభుత్వ కార్యకలాపాలనూ తనిఖీ చేయవచ్చు
సహ చట్టం కింద ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచయినా సమాచారాన్ని పత్రాల రూపంలో పొందడమే కాకుండా, సదరు కార్యాలయంలో జరిగే ప్రభుత్వ పనులు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? లేదా? అని తనిఖీ చేసే హక్కు సామాన్య ప్రజలకు ఉందని సహచట్టంలోని 2(జె) నిబంధన స్పష్టం చేస్తోంది. ఇటీవల దిల్లీలో ఒక మహిళ తన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదువు సరిగా చెపుతున్నారా? లేదా? అనేది తనిఖీ చేసే అవకాశం కల్పించాలని పాఠశాల పీఐఓకు దరఖాస్తు చేశారు. సహ చట్టం కింద ఆమెను అనుమతించడంతో తన పిల్లలు చదివే తరగతి గదికి వెళ్లి టీచర్‌ పాఠం ఎలా చెపుతున్నారనేది ప్రత్యక్షంగా పరిశీలించారని సమాచార కమిషన్‌ వర్గాలు వివరించాయి.

Leave a Comment