User Rating: / 0
PoorBest 

రైస్..రైస్
పార్శీ రైస్

కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం - ఒక గ్లాసు
ఉల్లిపాయలు - 50గ్రా.
మిరియాలు - ఒక స్పూను
లవంగాలు - ఎనిమిది
పంచదార - చెంచా
నెయ్యి - 75గ్రా.
దాల్చినచెక్క - నాలుగు ముక్కలు
నల్ల యాలకులు - ఆరు
ఉప్పు - తగినంత
జీడిపప్పు - ఆరు పలుకులు

తయారీ విధానం :
ముందుగా కుక్కర్లో పంచదార వేసి వేయించాలి. తర్వాత అందులో నెయ్యి వెయ్యాలి. ఇది మరుగుతుండగా లవంగాలు, నల్లయాలకులు, మిరియాలు, దాల్చినచెక్క వేసి వేగాక ఉల్లిపాయ తరగు వేసి బాగా వేయించాలి. ఇందులోనే కడిగిన బాస్మతిబియ్యం వేసి వేయించాలి. బియ్యానికి రెండింతల నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దించాలి. అంతే పార్శీ రైస్ రెడీ.

- పి. రాజామణి, విజయవాడ, కృష్ణాజిల్లా

పైనాపిల్ రైస్


సాధారణంగా ఎవరైనా పైనాపిల్‌ను ముక్కలు కోసిగాని, లేదంటే జ్యూస్ చేసుకుని గాని తింటారు. కానీ దీంతో స్వీట్ చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది చెయ్యడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. తక్కువ టైంలోనే తయారయ్యే పైనాపిల్ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం - పావు కిలో, పంచదార - 2 కప్పులు, పైనాపిల్ - ఒకటి, నెయ్యి - పావు కప్పు, జీడిపప్పు, కిస్‌మిస్, ఎండు ద్రాక్ష - పావుకప్పు.

తయారీ విధానం :
ముందుగా బాస్మతి బియ్యంతో పొడిపొడిగా ఉండేట్టు అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. పైనాపిల్ పండును తొక్క తీసి తురిమి ముద్దచేసి రసంతో సహా ఓ గిన్నెలో ఉంచుకోవాలి. ఇప్పుడీ ముద్దను చక్కెరతో కలిపి ఓ నాన్‌స్టిక్ మూకుడులో వేసి ఉడికించుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు మొదట నీళ్లులాగా అయి కాసేపటికి చిక్కగా అవుతుంది. ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి శుభ్రంగా కలిపి నెయ్యి వెయ్యాలి. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు వేసి మళ్లా కలిపి కాస్త కుంకుమ పువ్వును పాలల్లో కలిపి చల్లితే పైనపిల్ రైస్ సిద్ధమవుతుంది.

- రత్నా మహీధర్, హిమాయత్‌నగర్, హైదరాబాద్

క్యాసో బిర్యాని


కావలసిన పదార్థాలు :
బియ్యం- 300గ్రా, సొరకాయ- 100గ్రా, క్యారెట్-2, లవంగం-1, యాలకులు- తగినంత, చెక్క- చిన్నముక్క, జీలకర్ర- పావు చెంచా, అనాసపువ్వు- చిన్నముక్క, నెయ్యి- 1చెంచా, నూనె- 1చెంచా, బగార ఆకులు-2, కరివేపాకు- సరిపడా, కొత్తిమీర- చిన్నకట్ట, పచ్చిమిరపకాయలు-3, ఉల్లిపాయలు-1, అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 చెంచా

తయారీ విధానం :
బియ్యం ముందుగా అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసిన తర్వాత లవంగం, దాల్చిన చెక్క, అనాసపువ్వు, యాలకులు, జీలకర్ర, బగారా ఆకు వేసి వేయించాలి. తర్వాత క్యారట్, సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు నానిన బియ్యాన్ని స్టౌపై ఉడికించాలి. తర్వాత పై మిశ్రమాన్ని, కొత్తిమీర అన్నంలో కలపి సన్నని మంటపై కొంచెంసేపు ఉంచి దించేయాలి. దాంతో క్యాసో బిర్యానీ రెడీ అయినట్లే. దీనికి క్యారట్ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డిస్తే సరి.

- టి.పద్మావతి, ఆదిలాబాద్

పంచపప్పుల రైస్


కావలసిన పదార్థాలు :
బియ్యం - 3 కప్పులు
పెసరపప్పు - అర కప్పు
కందిపప్పు - అరకప్పు
శెనగపప్పు - అర కప్పు
నెయ్యి - 100గ్రా
మిరియాలు - చెంచా
జీలకర్ర - చెంచా
జీడిపప్పు - 25గ్రా
ఉప్పు - తగినంత
కరివేపాకు - నాలుగు రెబ్బలు
కొత్తిమీర - కట్ట
పాలు - గ్లాసు

తయారీ విధానం :
కుక్కర్లో నెయ్యి వేసి బాగా కాగాక జీడిపప్పు, జీలకర్ర వేయించి, కడిగిన బియ్యం, పప్పులు కూడా వేసి వాటికి రెండింతలు నీళ్లు పోసి, తగినంత ఉప్పు, పాలు పోసి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దించేయాలి. చల్లారిన తర్వాత మూత తీసి గరిటతో బాగా కలిపి కొత్తిమీరతో అలంకరించుకోవాలి. అంతే పంచపప్పుల రైస్ రెడీ.

- కె. శ్రీదేవి, తిరుపతి.

రొయ్యల క్రీమీ బిర్యానీ


కావలసిన పదార్థాలు :
రొయ్యలు - అరకిలో, ఉల్లిపాయలు - 4
పచ్చిమిర్చి - 4, బియ్యం - అరకిలో
నూనె - 4 చెంచాలు, నెయ్యి లేదా డాల్డా - 100గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2చెంచాలు,
నీళ్లు - 4గ్లాసులు, దాల్చిన చెక్క - చిన్నవి 2,
లవంగాలు - 5, యాలకులు - 5
మరాఠి మొగ్గలు - 5, బిర్యాని ఆకులు - 4
జాజికాయ - 1, పెరుగు - రెండు కప్పులు

పొడి చేసుకోవడానికి : జాపత్రి - పావు తులం, యాలకులు - పావు తులం, లవంగాలు - పావు తులం, దాల్చిన చెక్క - పావు తులం, ఉప్పు - చిటికెడు కారం - చిటికెడు, పసుపు - చిటికెడు.

తయారీ విధానం :
ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకోవాలి. నీరు లేకుండా చేసి అందులో చిటికెడు ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. తరువాత సన్నని మంట మీద పది నిమిషాలు ఉంచి దించేయాలి. రొయ్యల లోని నీరు బయటకు వచ్చాక రెండిటినీ వేరుచేయాలి. అలాగే బియ్యాన్ని కడిగి నీరు లేకుండా ఆరబెట్టాలి. తరువాత సన్నని మంటపై ఓ బాణలిపెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత కట్‌చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిరపకాయల ముక్కలను వేయాలి. ఇవి కాస్త వేగిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠి మొగ్గ, బిర్యాని ఆకు వేయాలి. ఇవి వేసిన రెండు నిమిషాల తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి అడుగు అంటకుండా ఉండేందుకు నెయ్యి వేయాలి. ఇప్పుడు రొయ్యలని రెండు భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని బాణలిలో వేసి నాలుగు గ్లాసుల నీళ్లు పోసి, ఉప్పు వెయ్యాలి. ఈ నీళ్లు మరుగుతుండగా ఉప్పును సరిచూసుకొని యాలకులు, జాజిపత్రి, లవంగాలు...తో చేసి పెట్టుకున్న పొడిని ఒక చెంచా మరుగుతున్న నీళ్లలో వేయాలి. తరువాత అందులో బియ్యాన్ని వేయాలి. అనంతరం రెండో భాగం రొయ్యలను పైన వేసి చుట్టూ సర్దుకుని ఆవిరిపోకుండా మూత పెట్టి మరో పదిహేను నిమిషాలు ఉంచితే సరి. ఘుమఘుమలాడే రొయ్యల క్రీమీ బిర్యాని సిద్ధం అవుతుంది. దీనికి కాస్త ఉల్లి-పెరుగు జోడిస్తే యమా టేస్టీగా ఉంటుంది.

- గంగుమళ్ల లక్ష్మీకనకదుర్గ, కోటవీధి,
రామచంద్రపురం, తూర్పుగోదావరి జిల్లా


క్యాప్సికమ్ రైస్


కావలసిన పదార్థాలు :
బియ్యం - కప్పు
క్యాప్సికం - 3
ఎండు మిరపకాయలు - 2
ఆవాలు - చెంచా
మినప్పప్పు - 3 చెంచాలు
శనగపప్పు - 3 చెంచాలు
ధనియాలు - చెంచా
పసుపు - అరచెంచా
దాల్చిన చెక్క - చిన్నది
ఉప్పు, నూనె - తగినంత

తయారీ విధానం :
ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి. ఎండు మిరపకాయలు, దాల్చిన చెక్కలను వేర్వేరుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడో బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, శనగపప్పు, క్యాప్సికం ముక్కలను వేయాలి. ఇవి వేగిన తరువాత మంట తగ్గించి పసుపు, ఉప్పు, మిరప, దాల్చిన చెక్క పొడులను వేసి బాగా కలపాలి. మరో ఐదు నిమిషాల తర్వాత అన్నాన్ని వేసి బాగా కలిపి దించుకోవాలి. పైన కాస్త నెయ్యి చల్లుకుంటే సరి. నోరూరించే క్యాప్సికం రైస్ రెడీ.

- పంపినవారు పేరు రాయలేదు

వెజిటబుల్ పులిహోర


కావలసిన పదార్థాలు :
క్యారెట్ ముక్కలు- 1కప్పు, బంగాళాదుంప ముక్కలు- 1కప్పు, క్యాప్సికమ్ ముక్కలు- అర కప్పు, దొండకాయలు-3, బీట్‌రూట్, క్యాబేజీ, పచ్చిబఠానీ, బీన్స్- 2 కప్పులు, పచ్చిమిరపకాయలు- 4, ఎండు మిరపకాయలు-4, ఇంగువ- చిటికెడు, పచ్చిసెనగపప్పు,- 2 చెంచాలు, పల్లీలు, మిరియాల పొడి, పసుసు, ఉప్పు- తగినంత, బియ్యం- అర కిలో

తయారీ విధానం :
ముందుగా బియ్యాన్ని కడిగి దానికి అన్ని కూరగాయల ముక్కలను కలిపి పొడిగా ఉండే విధంగా వండాలి. తర్వాత ఆ అన్నాన్ని వెడల్పాటి పాత్రలోకి తీసుకుని పుసుపు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, నూనె కలపాలి. తర్వాత తాలింపు వేసి ఈ అన్నానికి కలిపితే పులిహోర రెడీ అయినట్లే.

-ఎమ్.మాధవి, జగ్గయ్యపేట

పుదీనా - రాజ్మా బిర్యాని


కావలసిన పదార్థాలు :
బియ్యం - కేజీ
పుదీనా - నాలుగు కట్టలు
రాజ్మా గింజలు - 200 గ్రా
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిరపకాయలు - ఆరు
నూనె - 100గ్రా
నెయ్యి - 100గ్రా
లవంగాలు - 6
దాల్చినచెక్క - చిన్న ముక్కలు నాలుగు
ఉప్పు - తగినంత

తయారీ విధానం :
ముందురోజు రాత్రి రాజ్మా గింజల్ని నానబెట్టాలి. బిర్యానీ తయారు చేయడానికి ముందు బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. కాడలు లేకుండా పుదీనా ఆకులను తుంచి శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి. వెడల్పుగా ఉన్న గిన్నెలో నూనె, నెయ్యి వేసి కాగిన తర్వాత లవంగాలు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రాజ్మాగింజలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు పుదీనా పేస్టు వేసి దోరగా వేయించి తగినంత నీరు పోసి ఉప్పు వేయాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే పుదీనా - రాజ్మా బిర్యానీ రెడీ అయినట్లే.

- వూర విజయలక్ష్మి, కనుపర్తి, ప్రకాశం

ఎగ్ వెజిటబుల్ ఫ్రైడ్‌రైస్


కావలసిన పదార్థాలు :
కోడిగుడ్లు - రెండు, బియ్యం - అరకిలో
క్యారెట్ ముక్కలు - అరకప్పు, బీన్స్ ముక్కలు - అర కప్పు
పచ్చిబఠాణీలు - అరకప్పు, పచ్చిమిరపకాయలు - రెండు
సోయాసాస్ - చెంచా, టమోటాసాస్ - చెంచా
అజినోమోటో - చెంచా, ఉప్పు - తగినంత
కారం - చెంచా, మిరియాలపొడి - అరచెంచా
కొత్తిమీర తురుము - అర కప్పు, నూనె - తగినంత

తయారీ విధానం :
ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో కొంచెం నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత కోడి గుడ్లు కొట్టి వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత క్యారెట్, బీన్స్, బఠాణీలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. అందులో సోయాసాస్ వేసి బాగా కలపాలి. తర్వాత అందులో అన్నం వేసి అజనొమోటో, టమాటాసాస్, సోయాసాస్, ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. చివరికి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే వేడి వేడి ఎగ్ వెజిటబుల్ బిర్యాని రెడీ.

- వి. పద్మశ్రీ, శ్రీరాంపూర్, మంచిర్యాల

పెసరపునుకుల బిర్యానీ


కావలసిన పదార్థాలు :
పెసరపప్పు - 159 గ్రా
బాస్మతి బియ్యం - అరకిలో
యాలకులు - 4, లవంగాలు - 8
దాల్చినచెక్క - రెండు ముక్కలు
బిర్యాని ఆకులు - రెండు
సాజీరా - చెంచా
అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు చెంచాలు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిరపకాయలు - 8
కొత్తిమీర - కట్ట, పుదీనా - కట్ట
నూనె - సరిపడా
నెయ్యి - చెంచా
ఉప్పు - తగినంత
నీళ్లు - సరిపడా

తయారీ విధానం :
పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టాలి. నానిన పప్పును కొంచెం బరకగా రుబ్బుకుని కొంచెం ఉప్పు కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత రుబ్బిపెట్టుకున్న పెసరపిండిని చిన్న చిన్న పునుకులుగా వేసి వేయించుకోవాలి. తర్వాత బాస్మతి బియాన్ని కడిగి పది నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలో నెయ్యి, నూనె పోసి కాగిన తర్వాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానిఆకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా వేసి వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని రెండు నిమిషాలు వేయించి, బియ్యానికి రెండు రెట్లు నీరు పోయాలి. సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. సగం ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న పునుకులు, కొత్తిమీర వేసి కలిపి ఆవిరి పోకుండా మూతపెట్టి సన్నటి సెగపై ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి. అంతే పెసర పునుకుల బిర్యాని సిద్ధం.

- ఎస్. సుజాత, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా

* ప్రపంచంలోని కార్లు, ట్రక్కులు, విమానాలు, నౌకలు వంటి ప్రయాణ సాధనాలన్నిటికన్నా మాంసం పరిశ్రమ విడుదల చేస్తున్న గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారం ఎక్కువని 2006 ఐరాస నివేదికలోని అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే శాకాహారులుగా మారడం మంచి మార్గమని అది సూచించింది.

* చింతపండు, నిమ్మరసం వంటి పదార్థాలతో చేసే పుల్లటి వంటకాలను నాన్‌స్టిక్ పాత్రల్లో వండితే వాటి కోటింగ్ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది.

* పంచదార డబ్బాలో ఒకటిరెండు వెల్లుల్లి రెబ్బలు వేస్తే చీమలు పట్టవు.

* వేడినీటిలో పదిహేను నిమిషాల పాటు ఉంచిన నిమ్మకాయలు ఎక్కువ రసాన్నిస్తాయి.

* డైనింగ్ టేబుల్ మీద పెట్టే చిన్నచిన్న ఉప్పు పెప్పర్ సీసాల్లో బియ్యం గింజలు వేస్తే అవి ఉండకట్టకుండా సాఫీగా జారతాయి

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details